నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 25 : అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం పొద్దంతా కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం, మహాముత్తారంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మహాముత్తారం మండలంలో పెగడపల్లి పెద్దవాగు, అలుగువాగు ఉప్పొంగుతున్నాయి. ములుగు జిల్లాలో 31.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చీకుపల్లి అటవీప్రాంతంలోని తెలంగాణ నయాగారా బొగత జలపాతం జాలువారుతున్నది. టేకులగూడెం జాతీయ రహదారిని గోదావరి వరద ముంచెత్తడంతో ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలచిపోయాయి. ఈ నెల 30 వరకు వరంగల్ ,హనుమకొండ జిల్లాలో వాతావరణ శాఖ ‘ఎలో’్ల అలెర్ట్ జారీ చేసింది. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన మక్కలు తడిసిపోయాయి.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 26.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి 6,40,340 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతుండగా, గౌతమేశ్వర ఆలయం ముందు వరకు నీటిప్రవాహం వచ్చింది. మంచిర్యాల సమీపంలోని రాళ్లవాగు నిండుగా ప్రవహిస్తున్నది. మందమర్రి బొక్కలగుట్ట శివారు గాంధారిఖిల్లా సమీపంలో గండిపడిన మేడి చెరువును కలెక్టర్ కుమార్ దీపక్, తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఇరిగేషన్ డీఈ శారద పరిశీలించారు. సుందిళ్ల ప్రాజెక్టు 74 గేట్లు ఎత్తడంతో వరద దిగువకు వెళ్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. పుష్కరఘాట్లు మునిగిపోయాయి. ఆలయ పరిసరాల్లో వరద నీరు నిలిచి భక్తులు అవస్థలు పడ్డారు.