హైదరాబాద్/ సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కోటి వృక్షాల అభిషేకంతో పుడమి పులకించింది. రాష్ట్రవ్యాప్తంగా హరితహారం పండుగను తలపించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొదలు విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటి భూతల్లికి పచ్చలహారం తొడిగారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం శనివారం తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని ఫారెస్ట్రెక్ పార్కులో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పీ మహేందర్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, రంజిత్‌రెడ్డి మొక్కలునాటి ప్రారంభించారు. ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని తెలంగాణ పోలీస్ అకాడమీ వెనకవైపు సుమారు 256 ఎకరాల్లో విస్తరించిన చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్రెక్ పార్కును ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక సఫారీ వాహనాల్లో పార్కును కలియతిరిగారు.
ప్రజాభాగస్వామ్యంతో వృక్షార్చన: అల్లోల
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని గణనీయంగా పెంచుతున్నదని తెలిపారు. హరితహారం కింద ఇప్పటి వరకు 283 కోట్ల మొక్కలు నాటామని వివరించారు. పట్టణ, నగరవాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అటవీ బ్లాక్‌లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకుగాను 74 పార్కులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మంచిరేవుల ఫారెస్ట్రెక్ పార్క్ 74వ దని తెలిపారు.
అసెంబ్లీలో మొక్కలు నాటిన గుత్తా
కోటి వృక్షార్చనలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహాచార్యులు, బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలో మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటారు.
చరిత్ర సృష్టించిన కోటి వృక్షార్చన: కోలేటి
రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్వహించిన కోటి వృక్షార్చన కార్యక్రమం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు. ఇలాంటి మహాక్రతువులో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం హర్షణీయమని పేరొన్నారు. సీఎం కేసీఆర్ రూ.1500 కోట్లతో 13 లక్షల ఎకరాల అడవికి పునరుజ్జీవం కల్పించడం వల్లే నేడు తెలంగాణ అంతటా పచ్చదనం కళకళలాడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలే యాదయ్య, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్ర మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్పలితాలిస్తున్న హరితహారం: సంతోష్ కుమార్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నదని, రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరగడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దేశంలో మిగతా రాష్ర్టాల్లో పచ్చదనం తగ్గితే తెలంగాణలో అడవుల రక్షణ, సంరక్షణతో గ్రీన్ కవర్ పెరిగిందని అన్నారు. అటవీ అభివృద్ధి కార్పొరేషన్ రూ.7.83 కోట్లతో మంచిరేవుల ఫారెస్ట్రెక్ పార్కును అభివృద్ధి చేసినట్టు తెలిపారు. గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్, కోకాపేట, గండిపేట, మంచిరేవుల, బండ్లగూడ జాగీర్, పీరం చెరువు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ పార్కు ఎంతో అనుకూలంగా ఉన్నదని పేర్కొన్నారు. ఫారెస్ట్రెక్ పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగిందని ప్రతి రోజు మూడు వేల మంది, వీకెండ్లో ఐదు వేల మంది సేద తీరుతున్నారని వెల్లడించారు.