నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ లో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో తెలంగాణలో గద్దెనెక్కాలని కుట్ర పన్నుతున్నదని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా చందూ ర్ మండలం ఘన్పూర్లో సుమారు రూ.3 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు బుధవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ పెద్ద చెరువులో 90 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అన్నదాతకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు.
పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అనేక పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. కర్ణాటకలో ఉచిత పథకాలంటూ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు వాటిని అమలు చేయలేక చేతులు ఎత్తేసిందని విమర్శించారు. బస్సుల్లో మహిళలకు ఉచితం అంటూ ప్రచారం చేసి నేడు బస్సుల్లో డీజిల్ నింపలేక బాధలు పడుతున్నదని ఆరోపించారు. బెంగళూరు లాంటి నగరాల్లో సైతం కరెంటు కోతలు తప్పవడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకొన్నారని విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గంలో 24 వేల ఇండ్లు నిర్మించామని రికార్డుల్లో రాసి కాంగ్రెస్ నాయకులు కుంభకోణానికి పాల్పడ్డారని
ఆరోపించారు.