సిద్దిపేట : అభిమానానికి హద్దులు లేవంటారు. తమ నాయకుడి కోసం ఎంతటి త్యాగానికైనా, ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కొత్త తరహాలో తన అభిమానాన్ని చాటుకున్నాడు.
మార్కెట్ కమిటీ ఆవరణలో సీఎం కేసీఆర్ ముఖచిత్రంతో కూడిన సైకత శిల్పం తయారు చేయించి అందరినీ అబ్బుర పరిచాడు. కేసీఆర్‌తో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతుకు చెందిన సైకతా శిల్పాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు సైకత శిల్పం వద్ద సెల్ఫీ ఫొటోలు దిగి ఆనందం పంచుకున్నారు.
‘ సిద్దిపేట మట్టిలో పుట్టిన మాణిక్యానివి.స్వరాష్ట్ర స్వాప్నిక సాధకుడివి. బంగారు తెలంగాణ బ్రతుకు చిత్రకారుడివి. భావిభారతానికి బాసటగా నిలిచే ఆశాజ్యోతివి.అందుకో మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సీఎం కేసీఆర్ బర్త్ డే విషెస్ తెలియజేశాడు.