BRS | గోదావరిఖని, అక్టోబర్ 6: సింగరేణి కార్మికులకు వాస్తవ లాభాల్లో 33 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. టెంటు వేయకుండా అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. టీబీజీకేఎస్, బీఆర్ఎస్ శ్రేణులు ఎండలోనే బైఠాయించి, నల్ల కండువాలు కప్పుకొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో దీక్ష నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకోవడం సరికాదని, అతిగా ప్రవర్త్తిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు దీక్ష జరగకుండా పోలీసులు విశ్వప్రయత్నాలు చేయగా, టీబీజీకేఎస్, బీఆర్ఎస్ శ్రేణులు రూటు మార్చారు. టీబీజీకేఎస్ కార్యాలయ ఆవరణలో టెంటు వేసి దీక్ష చేపట్టారు.
నికర లాభాలపై వాటా ఇవ్వాల్సిందే
సింగరేణి లాభాల్లో వాటా లెక్కల్లో యాజమాన్యం గోల్మాల్ చేస్తున్నదని, కార్మికుల శ్రమను దోచుకుంటున్నదని దీఓ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.4,701 కోట్ల నికర లాభాలు సాధించిందని అన్నారు. 33 శాతం వాటా అంటే కార్మికులకు రూ.1,550 కోట్లు వస్తాయని తెలిపారు. అయితే సంస్థ విస్తరణ కోసం రూ.2 వేల కోట్లు మినహాయించుకున్న తర్వాత మిగిలిన డబ్బులపై 33 శాతం అంటే రూ.796 కోట్లను మాత్రమే వాటాగా పంచుతామని పేర్కొనడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే నికర లాభాలపై వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.