ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 29: గురుకుల విద్యాలయాలను సమున్నత స్థాయికి తీసుకెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని ఓయూ పరిశోధక విద్యార్థులు హెచ్చరించారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా ఆ పాఠశాలలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని గుర్తుచేశారు.
ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరిశోధక విద్యార్థి పాల అలెగ్జాండర్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వందల సంఖ్యలో గురుకులాలను ప్రారంభించినట్టు తెలిపారు. కార్పొరేట్‌ను తలదన్నేలా గురుకులాల అభివృద్ధికి ఆర్ఎస్పీ నిరంతరం శ్రమించారని కొనియాడారు.
విలువలు తెలియని మానవతారాయ్ లాంటి వ్యక్తికి ఆర్ఎస్పీ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని విమర్శించారు. ఊసరవెళ్లిలా రంగులు మార్చినట్టు, అధికారం కోసం మానవతారాయ్ పార్టీలు మారారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రుద్రవరం సునీల్, నవీన్ మొగిలిపాక, అందె అజయ్, సురేశ్, రామచంద్ర, భాస్కర్, మధు, రాజేశ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.