గోల్నాక, ఆగస్టు 26: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు బీజేపీ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నది. ఎప్పటి నుంచో తమ పార్టీలో పనిచేస్తున్నవారికి మళ్లీ కొత్తగా బీజేపీ కండువాలు కప్పి, వాళ్లు కాంగ్రెస్ నుంచి వచ్చారని ప్రచారం చేసుకొంటున్నది. ఇందుకు తిరుగులేని తాజా ఉదాహరణ కుంభం శ్రీనివాస్‌రెడ్డి ఉదంతం. హైదరాబాద్ గోల్నాక తులసీనగర్ కాలనీకి చెందిన కుంభం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కానీ చిత్రంగా శుక్రవారం ఆయన మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం శివన్నగూడెంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్ సబిత యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకొన్నారు. తాను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చినట్టు కలరింగ్ ఇచ్చారు. ఆయన గత చరిత్ర తెలిసినవారు ఇదేమిటంటూ ముక్కు మీద వేలేసుకొన్నారు.