తెలంగాణలో యాసంగి సీజన్లో ఇప్పడు కోటి టన్నులకు తక్కువ కాకుండా ధాన్యం ఉత్పత్తి అవడం సాధారణమైపోయింది. తొలిసారిగా 2020-21లో వడ్ల దిగుబడి కోటి టన్నుల మార్కును చేరుకోగా.. ఈ ఏడాది మరోసారి కోటి మార్కును దాటనున్నది. కేవలం నాలుగైదు ఏండ్లలోనే యాసంగి ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరగటం గమనార్హం. కేంద్రం ఆంక్షలు, ధాన్యం కొనుగోలు చేయలేమని, వరి వేయొద్దని రైతులకు సూచించటం వంటి కారణాలతో నిరుడు వరి సాగు తగ్గుముఖం పట్టింది. ఈ సీజన్లో తిరిగి భారీ విస్తీర్ణంలో సాగయ్యింది. ఇప్పటికే 54 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. మరో రెండు మూడు లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ యాసంగి సీజన్లో సుమారు 1.50 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): పుట్లకొద్దీ వడ్లతో రాష్ట్రం ధాన్యరాశిని తలపిస్తున్నది. గత మూడేండ్లుగా కొనసాగుతున్న వడ్ల ఉత్పత్తి ఈ యాసంగిలోనూ కొనసాగనున్నది. ఈ సీజన్లో సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. దీంతో ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో ధాన్యం ఉత్పత్తి ఆల్‌టైం రికార్డును సృష్టించనున్నది. 2020-21 సంవత్సరం యాసంగి సీజన్లో అత్యధికంగా 1.32 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఈ సీజన్లో ఆ రికార్డు బద్దలు కానున్నది. 2015-16 యాసంగిలో రాష్ట్రంలో 7.35 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 12.75 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఉత్పత్తి అయింది. కానీ, 2019-20 ఏడాది నుంచి రాష్ట్రంలో యాసంగి వ్యవసాయ స్వరూపమే మారిపోయింది. మొత్తం 39.31 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా సుమారు 89 లక్షల టన్నుల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. నిరుడు కేంద్రం ఆంక్షలు, ధాన్యం కొనుగోలు చేయలేమని, వరి వేయొద్దని రైతులకు సూచించటం వంటి కారణాలతో వరి సాగు తగ్గుముఖం పట్టింది. ఈ సీజన్లో గతంలో మాదిరిగా భారీ విస్తీర్ణంలో వరి సాగైంది. ఇప్పటికే 54 లక్షల ఎకరాల్లో సాగు కాగా ఇది మరో రెండు మూడు లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉన్నది. తద్వారా ఈ యాసంగి సీజన్లో సుమారు 1.50 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందనే అంచనాలున్నాయి.
తెలంగాణలో యాసంగి సీజన్లో ఒకప్పుడు 40-50 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే మహా గొప్ప. అలాంటి తెలంగాణలో ఇప్పుడు కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి తేలికగా మారిపోయింది. తొలిసారిగా 2020-21లో కోటి టన్నుల మార్కును చేరుకోగా ఇప్పుడు రెండోసారి కోటి మార్కును దాటనున్నది. కేవలం నాలుగైదేళ్లలోనే యాసంగిలో ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరగటం గమనార్హం. ఉత్పత్తి పెరుగుతుండటంతో ప్రభుత్వ కొనుగోలు కూడా పెరుగుతున్నది. 2014-15లో కేవలం 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం 2020-21లో రికార్డు స్థాయిలో 93 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో యాసంగిలో ధాన్యం కొనుగోలు సుమారు ఏడు రెట్లు పెరిగింది.