హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత ఎనిమిదిన్నరేండ్లలో ప్రభుత్వ రంగంలో కొత్తగా ఒక్క సంస్థనూ స్థాపించకపోగా.. ఉన్నవాటిని ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ జోరుగా సాగుతున్నది. మరోవైపు ప్రభుత్వరంగానికి పోటీగా ఉన్న ప్రైవేటు రంగానికి అన్ని విధాలుగా వనరులు సమకూరుస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందుకు తాజా ఉదాహరణ విద్యుత్తు రంగం. విద్యుత్తు స్థాపిత సామర్థ్యం పెరుగుదలలో గత ఎనిమిదేండ్లలో ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేటు రంగమే మెరుగుగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇందుకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (Central Electricity Authority – CEA ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు అద్దం పడుతున్నాయి.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టే నాటికి (2014-15) దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2,74,04 మెగావాట్లు. కాగా 2022 మార్చి చివరి నాటికి అది 3,99,497 మెగావాట్లకు చేరింది. ఏడేండ్లలో 45.32 శాతం పెరిగింది. ఈ పెరుగుదలలో ప్రైవేటు రంగానిదే పైచేయిగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 2014-15లో 95,079 మెగావాట్లు కాగా అది 2021 మార్చి నాటికి 1,04,855 మెగావాట్లకు పెరిగింది. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 72,521 మెగావాట్ల నుంచి 99,005 మెగావాట్లకు చేరింది. ఇక ప్రైవేటు రంగంలో 2014-15లో 1,07,304 మెగవాట్లు ఉండగా అది 2021 మార్చి చివరి నాటికి 1,95,637 మెగావాట్లకు పెరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని సంస్థలన్నింటిలో కలిపి 36 శాతం విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుదల నమోదైతే ప్రైవేటు రంగంలో 82 శాతం నమోదైంది. ప్రభుత్వ విద్యుత్తు ఉత్పత్తి సంస్థల పట్ల మోదీ సర్కార్ ప్రదర్శించిన సవతి తల్లి ప్రేమ కారణంగానే అవి వెనుకబడిపోతుండగా, ప్రైవేటు రంగం విజృంభిస్తున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్తు ఉత్పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు రంగానికి ఊతమిస్తుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ రంగానికే పెద్దపీట వేసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ప్రజా సంక్షేమంపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ విద్యుత్తు రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత ఏడేండ్లలో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిపోయింది. ఈ పెరుగుదల 48.56 శాతం ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2013-14లో తెలంగాణ జెన్కో పరిధిలో థర్మల్, జల విద్యుత్తు సామర్థ్యం 4,365.26 మెగావాట్లు ఉండగా అది 2022-23 నాటికి 6485.26 మెగావాట్లకు చేరింది. కేవలం థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 2014-15లో 2,282.5 మెగావాట్లు ఉండగా, 2022-23 నాటికి 4,042.5 మెగావాట్లకు చేరింది. ఎనిమిదేండ్ల వ్యవధిలో 77.10 శాతం పెరుగుదల నమోదైంది.
తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో చేపట్టిన 4000 మెగావాట్ల యాదాద్రి ఆల్ట్రా సూపర్ థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇదికూడా పూర్తయితే.. రాష్ట్ర ప్రభుత్వ రంగంలోనే అత్యధిక స్థాపిత సామర్థ్యాన్ని అతివేగంగా సాధించినట్టు అవుతుంది.
కేంద్రంతో పోలిస్తే.. విద్యుత్తు స్థాపిత సామర్థ్యం తెలంగాణలోనే ఎక్కువగా పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగంలో ఎనిమిదేండ్లలో కేవలం 36.51 శాతం పెరుగుదల నమోదు కాగా, తెలంగాణలో 48.56 శాతం పెరిగింది. థర్మల్ విద్యుత్తులో తెలంగాణ 77.10 శాతం సామర్థ్యాన్ని పెంచుకున్నది. ఇక జల విద్యుత్తు ఉత్పత్తిలో లభించిన అరకొర అవకాశాలనే అందిపుచ్చుకొని. సుమారు 360 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంపొందించుకున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాలతోపాటు ప్రైవేటు రంగం కూడా కలుపుకొని పెంచిన విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 45.32 శాతం కాగా.. తెలంగాణలో కేవలం ప్రభుత్వ రంగంలోనే సాధించిన ప్రగతి 48.56 శాతం కావడం విశేషం. రాష్ట్రంలో ప్రైవేటు రంగంకూడా కలిపితే మరింత మెరుగ్గా ఉండటం ఖాయం.

