హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తొమ్మిదిన్నరేండ్ల హైదరాబాద్ అభివృద్ధికే మహానగర ఓటరు పట్టం కట్టాడు. బీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలపడంలో చేసిన కృషికి ప్రతిఫలంగా గులాబీ పార్టీ అభ్యర్థులను ఓటుతో ఆదరించాడు. రాజకీయాలు ఎలా ఉన్నా.. పని చేసిన వారిని వెన్నుతట్టేలా తన తీర్పును ప్రకటించాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో గులాబీ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినప్పటికీ.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం బీఆర్ఎస్ దాదాపు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 29 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకంగా 17 చోట్ల విజయాన్ని నమోదు చేశారు. జిల్లాల్లో దూసుకుపోయిన కాంగ్రెస్ మాత్రం ఇక్కడ కేవలం 4 స్థానాలకే పరిమితం కాగా.. మజ్లిస్ ఏడు చోట్ల, బీజేపీ ఒక చోట తమ సిట్టింగ్ స్థానాలను మాత్రం కాపాడుకొన్నాయి.
ప్రతిసారిలాగే హైదరాబాద్ మహానగరంలోని ఓటర్లు అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల తీర్పు ఇచ్చారు. ఆనవాయితీగానే పనిచేసిన పార్టీవైపు మొగ్గు చూపా రు. 2014 ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ 15 నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డిలోని 14 నియోజకవర్గాలు.. మొత్తం 29 నియోజకవర్గాల్లో సుమారు 93,03,448 మంది ఓటర్లు ఉండగా.. 50,53,181 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అంటే 54.31శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం నాలుగు స్థానాలు మాత్రమే కైవసం చేసుకొన్నది. తెలుగుదేశం పార్టీ 11, కాంగ్రెస్ రెండు, బీజేపీ ఐదు స్థానాల్లో గెలవగా… మజ్లిస్ ఏడు స్థానాలను గెలుచుకొన్నది. ఓట్ల వాటా చూస్తే.. బీఆర్ఎస్ 22.57 శాతం, టీడీపీ 20.90 శాతం, కాంగ్రెస్ 16.81 శాతం, బీజేపీ 12.39 శాతం, మజ్లిస్ 15.53 శాతంగా ఉన్నాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చి న బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నాలుగున్నరేండ్లలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు గులాబీ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్ల వర్షం కురిసింది. ఆ ఎన్నికల్లో 29 నియోజకవర్గాలకుగానూ 1,28,10,212 మంది ఓటర్లు ఉండగా… కేవలం 40.13 శాతం పోలింగ్ నమోదుతో 51,41,420 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఈ ప్రజా తీర్పులో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 19 స్థానాలను కైవసం చేసుకొన్నది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 41.26 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా.. 19.80 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమై తన ఓటు శాతాన్ని 12.15 శాతంగా నమోదు చేసుకొన్నది. మజ్లిస్ తన ఏడు స్థానాలను నిలుపుకొని 9.05 శాతం ఓట్లను సాధించింది. దీనిని బట్టి అభివృద్ధి ఓటర్లను ఆకట్టుకున్నదని అర్థం చేసుకోవచ్చు.
గతంతో పోలిస్తే హైదరాబాద్ మహానగరవాసుల్లో అభివృద్ధి పట్ల అవగాహన, సామాజిక స్పృహ గణనీయంగా పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రావడం, మౌలిక వసతులు భారీగా వచ్చి వాటి ఫలాలు కండ్లారా చూడటంతో నగర ప్రజలు అభివృద్ధికి ఆకర్షితులయ్యారు. సోషల్ మీడియాలో ఇతర నగరాల పరిస్థితి కూడా క్షణాల్లో తెలవడం, నగరాల మధ్య అభివృద్ధిపై బేరీజులు.. తద్వారా చర్చలు జరగడంతో ప్రభుత్వాల పని తీరు ఎలా ఉండాలి? అభివృద్ధితో జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయనే విషయం సామాన్యుడికి సైతం అర్థమైంది. ఈ నేపథ్యంలో తొమ్మిదిన్నరేండ్లుగా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి.. అదే తరుణంలో పొరుగున ఉన్న రాష్ర్టాల్లోని నగరాల పరిస్థితి.. అందునా బెంగళూరు నగరంలో మౌలిక వసతుల కల్పన లేక ఎలా డీలా పడిందనే వివరాలు అందరి స్పృహలో ఉన్నాయి. దీంతో రాజకీయాంశాల కంటే అభివృద్ధి అనేది ప్రజల్లో ప్రధాన ఎజెండాగా మారింది. అదే ఎన్నికల్లోనూ ఓటర్లను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ఈ క్రమంలో 29 నియోజకవర్గాల్లో ప్రజా తీర్పు కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి అద్దం పట్టేలా ఉన్నది. దీంతో మహానగర ఓటర్లు తిరిగి మరోసారి గులాబీ పార్టీని భారీస్థాయిలో ఆదరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29 స్థానాలకుగానూ 17 స్థానాలను కైవసం చేసుకొన్నది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు కనిపించినా.. మహానగర ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు. బీజేపీ తిరిగి అదే స్థానాన్ని నిలుపుకొన్నది. మజ్లిస్ తన ఏడు స్థానాలను కాపాడుకొన్నది. కాంగ్రెస్ మాత్రం మునుపటికంటే రెండు స్థానాలను అదనంగా గెలుచుకొని నాలుగు స్థానాలను తన ఖాతాలో వేసుకొన్నది. ఓట్ల శాతం పరిశీలిస్తే.. ఈ ఎన్నికల్లో 29 నియోజకవర్గాల్లో సుమారు 1.11 కోట్ల ఓటర్లకుగానూ 54.15 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఆదివారం రాత్రి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో 28 స్థానాల్లో బీఆర్ఎస్ 39.57 శాతం ఓట్లు సాధించగా… కాంగ్రెస్ 29.97 శాతం, బీజేపీ 19.99 శాతం ఓట్లు పొందింది. మజ్లిస్ 8.77 శాతం ఓట్లను సాధించుకొన్నది.