CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ‘తెలంగాణ సంసారం అప్పుల పాలైంది. ఈ అప్పుల సంసారాన్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకొంటూ వస్తున్నా’.. గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. అయితే, ముఖ్యమంత్రి తాను చెప్పినట్టు అప్పుల నుంచి తెలంగాణను తెరిపిన పడేయడం కాదు.. రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. రోజుకు సగటున రూ. 210 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నారు. అలా అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ. 50 వేల కోట్లు అప్పు చేశారు. గడిచిన 60 ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణకు సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన అప్పు రూ. 72 వేల కోట్లుగా ఉండగా.. ఆ రికార్డును ఏడాదిలోనే అధిగమించేందుకు రేవంత్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. సరే.. చేసిన ఆ అప్పు ద్వారా సేకరించిన సొమ్మునైనా ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమానికైనా ఖర్చు పెట్టారా? అంటే అదీ లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ద్వారా సేకరించిన ధనం.. ఎటు వెళ్తున్నదన్న ప్రశ్న యావత్తు తెలంగాణ సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్హయాంలో అప్పులు చేయడాన్ని ఓ పాపంగా వల్లెవేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి రాగానే అప్పులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలన్నీ కలిపి తెలంగాణకు సంబంధించి రూ. 72,658 కోట్లు అప్పుగా చేస్తే, గడిచిన 8 నెలల పాలనలో రేవంత్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు అప్పులు చేయడమే దీనికి రుజువు. ఈ ఏడాది జూలై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ సర్కారు వెల్లడించింది. అనంతరం.. రిజర్వు బ్యాంకు వద్ద ఈ నెల 6న రూ. 3 వేల కోట్లు అప్పు చేసింది. 13న (మంగళవారం) మరో రూ.3000 కోట్ల అప్పు తీసుకొనేందుకు చర్యలు చేపట్టింది. అంతక్రితం హెచ్డీసీవో నుంచి రూ. 3 వేల కోట్లు, ఎన్సీడీసీ నుంచి మరో రూ. 5 వేల కోట్లు ఇలా మొత్తంగా 8 నెలల్లో రేవంత్ ప్రభుత్వం రుణాలు రూ. 50,118 కోట్లకు చేరాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రూ.62,012 కోట్లు రుణ సమీకరణ చేయనున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. బహిరంగ మార్కెట్ నుంచి రూ.57,112 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,900 కోట్లు, ఇతర రుణాల రూపంలో రూ.1000 కోట్లు అలా మొత్తంగా రూ. 62 వేల కోట్లు సమీకరించనున్నట్టు వివరించింది.
దుష్ప్రచారంతో పబ్బం
పదేండ్లపాలనలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాల్జేసిందని రేవంత్ ప్రభుత్వం తరుచూ దుష్ప్రచారాన్ని చేస్తున్నది. అయితే, తీసుకొచ్చిన అప్పులను చూస్తున్నారేగానీ, రాష్ట్రంలో పెంచిన ఆస్తుల విలువను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలంగాణ మేధావులు అంటున్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను పెట్టుబడిగా మార్చి.. భవిష్యత్తులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆదాయ వనరుగా మారే ప్రాజెక్టుల్లోనో, ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థను ఏర్పాటు చేయడానికో వాడుతుంటాయి. ఉదాహరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది. ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు, పరోక్షంగా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారాయి. రుణాల ద్వారా మిషన్ భగీరథ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఇది ఆదాయ వనరు కాకపోయినా, ప్రజల జీవన స్థితిగతులను మార్చింది. ఇలాంటి పథకాలు, ప్రాజెక్టులను గత 8 నెలల్లో రేవంత్ ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రకటించలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 వేల కోట్ల భారీగా అప్పులు చేసినప్పటికీ ఆ సొమ్మును దేనికి వెచ్చిస్తున్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయని రేవంత్ సర్కారు.. ఎంతో ఆర్భాటంగా చెప్పుకొంటున్న ‘మహాలక్ష్మి’ పథకానికీ నిధులు విదల్చడం లేదు. దీంతో అప్పుగా తీసుకొచ్చిన సొమ్ము ఎటు వెళ్తున్నదన్న చర్చ మొదలైంది.
సృష్టించిన సంపదపై నోరు మెదపరేం?!
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందంటూ దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గత పదేండ్లలో రాష్ట్ర సంపద ఎలా పెరిగిందో చెప్పడానికి మనసురావడం లేదు. వాస్తవానికి దేశంలోని అనేక రాష్ర్టాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేశాయి. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పరిమితికి లోబడే వ్యవహరించింది. ఇష్టారాజ్యంగా కాకుండా అవసరం మేరకే రుణాలు తెచ్చి ప్రాజెక్టుల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చించిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 2023-24 నాటికి తెలంగాణ ప్రభుత్వం రూ.3.89 లక్షల కోట్ల రుణాలు సేకరించినట్టు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 5న లోక్సభలో వెల్లడించింది. ఇది తెలంగాణ జీఎస్డీపీలో 27.8 శాతానికి సమానమని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో పేర్కొన్నది. 2014లో స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి అన్ని రంగాల్లో అధ్వాన స్థితిలో ఉన్న తెలంగాణ.. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదల ఇలా అన్ని రంగాల్లోనూ ఉన్నత శిఖరాలకు చేరింది. దీన్నిబట్టే గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ సంపద గణనీయంగా పెరిగినట్టు స్పష్టమవుతున్నది. ఇదే సమయంలో హద్దులు దాటి రెట్టింపు అప్పులు చేసిన రాష్ర్టాలు ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్ 37.1% అప్పులతో అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశ అప్పు రూ.185 లక్షల కోట్లకు చేరుతుందని, ఇది జీడీపీలో 56.8 శాతానికి సమానమని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్లో పేర్కొన్నది.
ఆదాయాన్ని పెంచడానికే అప్పుడు రుణాలు
స్వరాష్ట్రంగా ఏర్పడేనాటికి తెలంగాణ అప్పులు రూ.72,658 కోట్లుగా ఉన్నట్టు నిరుడు డిసెంబర్లో విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొన్నది. అంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణపై ఉన్న రుణభారం అది. కేంద్రంలోనూ అంతే. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి దేశ అప్పు రూ.55 లక్షల కోట్లు. వాటిని ఆ తర్వాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం చెల్లించింది. కానీ, గత పదేండ్లలో దేశంపై ఏకంగా రూ.130 లక్షల కోట్ల రుణభారాన్ని మోపింది. ఆ అప్పులను తర్వాతి ప్రభుత్వాలు చెల్లించాల్సిందే. అయితే, అప్పుల ద్వారా సేకరించిన ధనాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారన్న అంశమే ఇక్కడ ప్రధానం. 2014లో తెలంగాణ బడ్జెట్ రూ.లక్ష కోట్లు మాత్రమే. అప్పటి అప్పు బడ్జెట్లో 72 శాతంగా ఉన్నది. దీంతో రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం రుణాలను సేకరించి, ఆ నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేసింది. అటు మౌలిక వసతులు కల్పించడంతోపాటు, ఇటు భారీ ప్రాజెక్టులు, పథకాలు అమలు చేసింది. ఫలితంగా తెలంగాణ జీఎస్డీపీ, రాబడి, తలసరి ఆదాయం రెండున్నర రెట్ల మేరకు పెరిగాయి. అయితే, అప్పులను చేసుకుంటూపోతున్న రేవంత్ ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని పథకాలకూ కాకుండా, మౌలిక సదుపాయాలకూ కాకుండా ఇంకా దేనికి వినియోగిస్తున్నదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని గత బీఆర్ఎస్ సర్కారులాగే తెలంగాణ అభివృద్ధికి వినియోగించకపోతే..రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ ఆర్థిక పురోగతి తీరుతెన్నులు
2024
2023
రేవంత్ ప్రభుత్వం రుణాలు ఇలా..