హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్‌లో రూ. 2.5 కోట్ల హవాలా డబ్బు చేతులు మారుతుండగా వెస్ట్‌జోన్ టాస్క్ పోలీసులు పట్టుకొన్నారు. ఈ డబ్బు ఓ బీజేపీ నేత వద్దకు చేరాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఆ డబ్బు చిక్కింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజం మండలానికి చెందిన బచ్చు రాము కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటూ బోయాన్షి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలోని తన సహ ఉద్యోగి సత్యనారాయణ చెప్పినట్టుగా రాము శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డు నం.76లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ. 2.5 కోట్ల నగదును తీసుకొన్నాడు. ఈ డబ్బును బేగంబజార్‌లో ఉండే గుజరాత్‌కు చెందిన హవాలా వ్యాపారి, బీజేపీ నేత లలిత్‌కు అందజేయాల్సి ఉన్నది. రాము వద్ద ఉన్న డబ్బును తీసుకురావాలని లలిత్.. బేగంబజార్‌లో ఉండే గుజరాత్‌కు చెందినఈశ్వర్లాల్ పటేల్, రాజస్థాన్‌కు చెందిన అశోక్ సింగ్‌ను పంపించాడు. వీరు జూబ్లీహిల్స్‌లోని భారతీ య విద్యాభవన్ సమీపంలో రూ.2.5కోట్ల నగదును మార్చుకుంటుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొన్నారు. నగదును సీజ్ చేసి, రాము, ఈశ్వర్లాల్పటేల్, అశోక్‌సింగ్ ను అరెస్టు చేశారు. లలిత్, సత్యనారాయణ పరారీలో ఉన్నారు.
బీజేపీ నాయకుడి హవాలా దందా..
గుజరాత్‌కు చెందిన లలిత్ హవాలా దందా చేస్తున్నాడు. బేగంబజార్‌లో ఉండే లలిత్ ఇటీవల బీజేపీలోకి చేరాడు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో హవాలా డబ్బును రవాణా చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.