పాలనలో, హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌కు దారుణ పరాభవం తప్పదు. జారుడు బల్లపై ఉన్న కాంగ్రెస్ రోజురోజుకూ దిగజారుతున్నది. కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో దక్కేది ముమ్మాటికీ మూడో స్థానమే. బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ ఘంటాపథంగా చెప్తున్నాయి.
మున్సిపల్ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి దారుణంగా విఫలమయ్యారు. బీఆర్ఎస్ కట్టిన ఫ్లె ఓవర్లు, రోడ్ల నిర్వహణ కూడా ఆయనకు చేతగావడం లేదు. హైదరాబాద్ వరద కష్టాలకు బాధ్యుడు రేవంత్‌రెడ్డే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రద్దు చేయడంతోనే ఆ ప్రాంతంలో భారీగా రద్దీ పెరిగింది. వానకాలం సన్నద్ధత ప్రణాళికపై సమీక్ష నిర్వహించలేదు.
-కేటీఆర్
హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ నేతల కుట్రలకే ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ బలైపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆమె ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణం. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు ఉప్పందించింది ఎవరో.. ఆ కుట్ర వెనుక ఎవరి హస్తం ఉన్నదో ప్రజలందరికీ తెలుసు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మీనాక్షి అంటే గిట్టనివారే ఈ పనిచేశారని, వారెవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటేనే కంపు పార్టీ అని, ద్రోహుల పార్టీ వ్యవహారంలోకి తమను ఎందుకు లాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన నాటకంలోకి బీఆర్ఎస్ను లాగడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తేరుకొని రాష్ట్ర కాంగ్రెస్‌లో బ్లాక్షీప్లను (ద్రోహులను) గుర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిట్ వేసి బీజేపీ నేతలకు ఉప్పందించిందెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
‘వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోం. ఒంటరిగానే పోటీ చేస్తాం. ఘన విజయం సాధిస్తాం. ఒంటరి పోరాటమే కలిసొచ్చింది. భవిష్యత్తులోనూ అదే పరిస్థితి ఉంటుంది’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
పాలనలో, హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌కు దారుణ పరాభవం తప్పదని పేర్కొన్నారు. జారుడు బల్లపై ఉన్న కాంగ్రెస్ రోజురోజుకూ దిగజారుతున్నదని, రాబోయే ఎన్నికల్లో దక్కేది ముమ్మాటికీ మూడో స్థానమేనని చెప్పారు. బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని సర్వేలన్నీ ఘంటాపథంగా చెప్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ పన్నెండేండ్ల పాలనలో తెలంగాణకు నయాపైసా న్యాయం జరుగలేదని మండిపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి ఓటమి, డీలిమిటేషన్, రైతు డిస్కమ్ ఏర్పాటులో దాగి ఉన్న కుట్రలు, భూముల వేలం ముసుగులో సాగుతున్న అక్రమాలు, హైడ్రాను అడ్డుపెట్టుకొని సాగిస్తున్న విధ్వంసం, బీఆర్ఎస్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, సింగరేణిలో కుంభకోణాలు, ఆర్టీసీ విలీన ప్రక్రియలోని గందరగోళంపై సవివరంగా సమాధానాలిచ్చారు. హిట్లర్ హంతకముఠా ఆదర్శమని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డిపై తనదైన శైలిలో పంచులు విసిరారు. కాంగ్రెస్‌లో పదవులు అమ్ముకొంటున్న తీరును ఎండగట్టారు. రేవంత్‌రెడ్డి చేసిన దుర్మార్గాలతో వచ్చే పదిహేను, ఇరువై ఏండ్ల వరకు కాంగ్రెస్‌ను మరచిపోవాల్సిందేనని సెటైర్లు వేశారు.
కాంగ్రెస్‌లో డబ్బులిచ్చిన వారికే పదవులు వస్తున్నాయని ఆ పార్టీ నేత షబ్బీర్‌అలీ చెప్పింది ముమ్మాటికీ నిజమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజం బయటపెట్టిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో పీసీసీ, ముఖ్యమంత్రి పదవులను అమ్ముకొన్న చరిత్ర ఆ పార్టీ సొంతమని ఎద్దేవా చేశారు. ‘రేవంత్‌రెడ్డి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకొన్న వ్యక్తి. ఆయన రెగ్యులర్ సీఎం కాదు.రెన్యువల్ సీఎం. ప్రతినెలా ఢిల్లీలోని పార్టీ పెద్దలకు పైసలు ముట్టజెప్పితేనే పదవి ఉంటుంది. లేకుంటే ఊడుతుంద’ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హిట్లర్ హంతక ముఠా ఆదర్శమని చెప్పిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదు; మానసిక రోగి అని కేటీఆర్ విమర్శించారు. ‘ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో గాజా తరహాలో విధ్వంసం సృష్టించానని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. మానసిక రోగులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. రేవంత్ చెప్పిన శిథిలాల కిందనే కాంగ్రెస్‌ను ప్రజలు పాతిపెడుతారు. హిట్లర్ టీమ్‌లో లేని హైడ్రా తనకు ఆదర్శమని చెప్పుకొంటున్నరు. అబద్ధపు ప్రచారంలో గోబెల్స్‌ను మించిపోయారు. గోబెల్స్, రేవంత్ ఇద్దరు అన్నదమ్ములు’ అని దుయ్యబట్టారు.
హిట్లర్‌తో పోల్చుకొంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు వెనుకేసుకొనిరావడం దురదదృష్టకరమని పేర్కొన్నారు. సీఎం మాటలను సమర్థించేందుకు మీడియా ఎదుట ఆయన వ్యవహరించిన తీరును చూస్తే జాలేసిందని, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చురకలంటించారు.
ప్రస్తుత సిటీ హైదరాబాద్‌పై సోయిలేని సీఎం రేవంత్‌రెడ్డి.. లేని ఫ్యూచర్‌సిటీ కోసం కలల్లో విహరిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాలు తప్ప, కనీసం ఒక్క ఎకరమైనా కొత్తగా సేకరించినవా? ఉన్న సిటీని గాలికొదిలి కొత్త సిటీలో ఏం ఉద్ధరిస్తావు?’ అని ప్రశ్నించారు. మొన్న ఫ్యూచర్‌సిటీలో పెట్టిన సభలో వర్షాలపై ముఖ్యమంత్రి మాటలు హాస్యాస్పదం. రోడ్లపై వరద నీళ్లు పోతేనేమో తన ఘనత అని చెప్పుకోవడం, నిలుస్తేనేమో బీఆర్ఎస్ చేసిన పాపమని అంటగట్టడం’ దుర్మార్గమని ధ్వజమెత్తారు. చిన్నవర్షానికే నగరం అతలాకుతలమైందని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, మరి రోడ్ల కింద ఆయన తవ్వించిన వానబావులు ఏమైపోయాయని ఎద్దేవా చేశారు. 79 ఏండ్ల స్వతంత్ర భారతంలో 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్సే దేశానికి శాపమని దుయ్యబట్టారు. ‘పదేండ్ల పాలనలో హైదరాబాద్‌లో బీఆర్ఎస్ చేసిన ఎస్ఎన్డీపీ, రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతోనే పరిస్థితులు మెరుగుపడ్డాయి. మా పనితీరును మెచ్చే నగర ప్రజలు మా పార్టీని ఆదరించారు’ అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
మున్సిపల్ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి విధి నిర్వహణలో దారుణంగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్శించారు. వానకాలం సన్నద్ధత ప్రణాళికపై సమీక్ష నిర్వహించలేదని, బీఆర్ఎస్ కట్టిన ఫ్లై ఓవర్లు, రోడ్ల నిర్వహణ కూడా రేవంత్‌కు చేతగావడంలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరవాసుల వరదకష్టాలకు బాధ్యుడు రేవంత్‌రెడ్డేనని తేల్చిచెప్పారు. శంషాబాద్ ఎయిర్ట్‌పోర్ట్ వరకు మెట్రో రద్దు చేయడంతోనే ఆ ప్రాంతంలో భారీగా రద్దీ పెరిగిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి ఉంటే 18 నెలల్లో పూర్తయ్యేదని, లక్షల మందికి మేలుజరిగేదని స్పష్టంచేశారు. భూ సేకరణ లేకుండా సులభంగా పూర్తయ్యే మెట్రోరైలును రద్దుచేసి, మెట్రో ఎల్అండ్టీ సీఎఫ్‌వోను దబాయించి దౌర్జన్యానికి దిగి లాక్కున్నారని ఆరోపించారు. రెండున్నరేండ్లలో కేవలం రెండు చెరువులను పునరుద్ధరించి గొప్పగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 100కుపైగా చెరువులను పునరుద్ధరించి గొప్పగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. కానీ ఏనాడూ పోజులు కొట్టలేదని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసేందుకే హైడ్రాను తెరపైకి తెచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రోగాలకు జిందా తిలస్మత్ చందంగా చెరువులు, కుంటల్లో పూడికతీత, వరద నివారణ, చెరువుల నిర్వహణ ఇలా సమస్త సమస్యల పరిష్కారానికి హైడ్రాను చూపుతున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా డబ్బుల వసూళ్లు, భూ దందాలు తప్పించి ఇంకేమీ చేయడంలేదని విమర్శించారు. నిజంగానే హైడ్రా ద్వారా లక్ష కోట్ల విలువైన భూములను రక్షించి ఉంటే, వాటిని అమ్మి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పార్టీ సభ్యత నమోదు, సంస్థాగత ప్రక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టామని కేటీఆర్ చెప్పారు. ఇందుకోసం రూపొందించిన స్పెషల్ యాప్ టెస్టింగ్ దశలో ఉన్నదని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొనివస్తామని ప్రకటించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలకు శిక్షణ ఇస్తామని చెప్పారు. తదనంతరం సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వెరసీ ఆరునెలల్లోగా సంస్థాగత ప్రక్రియను పూర్తిచేస్తామని వివరించారు.
సభ్యత్వ నమోదుకు రూ.50 ఫీజుగా నిర్ణయించామని, పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు రాసి కంటే వాసిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నామని చెప్పారు. కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణ పూర్తిచేసుకొని సుశిక్షితులైన కార్యకర్తలను సిద్ధంచేసుకొని వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో కార్యరంగంలోకి దిగుతామని ప్రకటించారు.
బీజేపీ, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ బలంగా ఉన్నదని స్పష్టంచేశారు. ఆ రెండు పార్టీలతో పొల్చుకుంటే సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం ఉన్నదని చెప్పారు. అదేవిధంగా ‘సర్’పై ఫోకస్ పెట్టామని పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే 60 నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ పాలనపై ప్రజలకు అసంతృప్తి ఉన్నమాట నిజమేనని చెప్తూ, ప్రజలు సూచించిన లోపాలను సవరించుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, ఆశావాద దృక్పథంతో వ్యూహాత్మకంగా ముందుకెళ్తామని పునరుద్ఘాటించారు.
యువత నిరాశానిస్పృహలో ఉన్నదని, తిరుగుబాటు తప్పదేమోనని తాను ఆరు నెలల కిందటే ఓ టీవీ ఇంటర్వ్యూలో చెబితే అక్కడున్నవారందరూ నవ్వారని కేటీఆర్ చెప్పారు. కానీ, నాడు తాను చెప్పినట్టే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందని గుర్తుచేశారు. ఆ పార్టీకి ఆన్లైన్లో లభిస్తున్న విశేష స్పందన చూస్తుంటే, దేశ యువత నిరాశలో ఉన్నదనే విషయం అర్థమవుతున్నదని చెప్పారు. అయితే కాక్రోచ్ పార్టీ వ్యవహారాలపై క్షేత్రస్థాయిలో స్పష్టతలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన రియల్ఎస్టేట్ రంగం రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత కుప్పకూలిందని కేటీఆర్ ఆరోపించారు. అస్తవ్యస్త విధానాలు, అపసవ్యపు పోకడలతోనే ఈ దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన ఇండ్ల నిర్మాణాలు ఇప్పుడు పూర్తికావడంతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. కానీ, కొన్ని ప్రాంతాల్లోని భూముల ధరలను చూపి రియల్ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు పన్నేండ్ల పాలన పూర్తిచేసుకొన్నామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీలేదని, పేదవాడికి ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. పన్నెండేండ్లలో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. 2022 నాటికి అందరికీ ఇండ్లు, ఇంటింటికీ నీళ్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, రైతుల ఆదాయం రెట్టింపు ఇలా అన్ని అంశాల్లో మోదీ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు.
తెలంగాణ సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ..తమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగానో ప్రయత్నించారని కేటీఆర్ చెప్పారు. పలుమార్లు అప్పటి మహారాష్ట్ర సీఎం దగ్గరికి వెళ్లి ఒప్పించేందుకు కృషిచేశారని గుర్తుచేశారు. అంతకుముందు కాంగ్రెస్‌కు చెందిన మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ సైతం ఆ రిజర్వాయర్‌కు ఒప్పుకొనేదిలేదని అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌కు లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా ప్రాజెక్టును నిర్మించలేకపోయారని పేర్కొన్నారు.
కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పుడు నిద్రలేచి అనుమతులు సాధిస్తానని కొత్త డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. సాధ్యంకాదని తెలిసినా ప్రగల్భాలు పలుకుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు నీళ్ల విషయంలో న్యాయం జరిగిందని స్పష్టంచేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ సభ పెట్టిన తర్వాతే కేఆర్ఎంబీకి రాసిన లేఖను కాంగ్రెస్ సర్కార్ వెనక్కితీసుకొన్నదని చెప్పారు.
బొగ్గు గనులతో కళకళలాడే సింగరేణి కాంగ్రెస్ పాలనలో అక్రమాలకు అడ్డాగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది కనుసన్నల్లోనే అక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయని విమర్శించారు. సైట్విజిట్ సర్టిఫికెట్ ముసుగులో టెండర్లలో అవినీతికి తెరతీశారని ధ్వజమెత్తారు. నైని టెండర్ల రద్దే ఇందుకు సజీవ సాక్ష్యమని స్పష్టంచేశారు. ఒకవైపు టెండర్లు రద్దుచేసి, మరోవైపు అక్రమాలు జరుగలేదని బుకాయించడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. అక్రమాలు జరుగకుంటే టెండర్లు ఎందుకు రద్దుచేశారని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి కార్మికుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించామని గుర్తుచేశారు.
కారుణ్య నియామకాలను పునరుద్ధరించామని చెప్పారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే తమ అనుబంధం సంఘం టీబీజీకేఎస్ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అక్రమాలను నిలువరించాల్సిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి తన బాధ్యతల నుంచి తప్పించుకొంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తరఫున లేఖలు రాసినా స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై కార్మికులకు తీరని ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని గుర్తుచేశారు. కేవలం అపాయింటెడ్ డే ప్రకటించాల్సి ఉన్నదని చెప్పారు. కానీ కాంగ్రెస్ తాత్సారం చేస్తూ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. జూన్ 2న ప్రకటిస్తామని ఆర్భాటంగా చెప్పి పారిపోయిందని విమర్శించారు. ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే వారి కోసం రోడ్డెక్కి కొట్లాడుతుందని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి.. లేని ఫ్యూచర్‌సిటీ కోసం కలల్లో విహరిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల
ఎకరాలు తప్ప, కనీసం ఒక్క ఎకరమైనా కొత్తగా సేకరించినవా? ఉన్న సిటీని గాలికొదిలి కొత్త సిటీలో ఏం ఉద్ధరిస్తావు?
-కేటీఆర్
నాడు కేసీఆర్ నిర్మించిన ప్రగతిభవన్‌పై దుమ్మెత్తిపోసిన రేవంత్‌రెడ్డి.. తాను అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ తప్పుబట్టారు. ప్రగతిభవన్‌లో బంగారు బాత్రూమ్లు, 150 గదులు అంటూ విషప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందారని ఆరోపించారు. కానీ, నేడు ఎంసీహెచ్ఆర్డీలో ఏకంగా రూ.200 కోట్లతో రాజసౌధాన్ని నిర్మించుకొన్నారని మండిపడ్డారు. కాంపౌండ్ వాల్కే రూ.9 కోట్లు వెచ్చించారని ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు, కొత్త పింఛన్ల మంజూరు, పెంపు, రైతుభరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధుల్లేవని చెప్తున్న రేవంత్‌రెడ్డి.. తన కోసం విలాసవంతమైన భవనం కట్టుకోవడం శోచనీయమని పేర్కొన్నారు.
ఈ భవన నిర్మాణానికి సంబంధించిన జీవోలు రహస్యంగా ఉంచడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే అర్ధరాత్రి గృహప్రవేశం చేయడమెందుకని నిలదీశారు. ఎలాంటి రహస్యాలూ లేకుంటే మీడియాకు చూపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నిర్మించిన ఇంట్లో నివసించడం ఇష్టంలేకుంటే మరీ ఆయన నిర్మించిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎందుకు కూర్చొంటున్నారని నిలదీశారు.
వచ్చే జూలైలో డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ దేశవ్యాప్తంగా జరుగకున్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని చెప్పారు. జమిలీ ఎన్నికలు ఉండకపోవచ్చని అంచనావేశారు. హైదరాబాద్‌లో పార్లమెంట్ స్థానాలు పెంచాలనే అంశంపై తనకు సమాచారం లేదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఏ ప్రతిపాదనపైన అయినా పార్టీలో చర్చించి అభిప్రాయం చెబుతామని స్పష్టంచేశారు. దక్షిణ భారతదేశానికి చెందిన ఆరు రాష్ట్రాలు దేశానికి 38% జీడీపీని అందిస్తున్నాయని, దక్షిణాదికి గతంలో మాదిరిగా 24% స్థానాలు కేటాయించాల్సిందేనని తేల్చిచెప్పారు.
దక్షిణాదికి అన్యాయం జరిగితే బీఆర్ఎస్ ఊరుకోబోదని, ఆ ప్రక్రియకు మద్దతిచ్చే ప్రసక్తి ఉండదని హెచ్చరించారు. ప్రజలతో కలిసి గొంతు విప్పుతామని స్పష్టంచేశారు. దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం తగ్గితే దేశంలో అస్థిరతకు దారితీసే అవకాశముంటుందని విశ్లేషించారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసేందుకే హైడ్రాను తెరపైకి తెచ్చింది. డబ్బూల వసూళ్లు, భూ దందాలు తప్పించి హైడ్రా ఇంకేమీ చేయడంలేదు. నిజంగానే హైడ్రా ద్వారా లక్ష కోట్ల విలువైన భూములను రక్షించి ఉంటే, వాటిని అమ్మి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలి.
-కేటీఆర్
భూముల వేలం ద్వారా వేలకోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్తున్న ప్రభుత్వం ఆ నిధులను ఏం చేస్తున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. ఖజానాకు చేరాల్సిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నదని నిలదీశారు. రెండున్నరేండ్లలో ఒక ప్రాజెక్టు అయినా కట్టారా? ఒక్క రోడ్డయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసి ఉద్ధరించిందేమిటని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెడుతూ ఆర్ఆర్ యాక్ట్ పేరిట విద్యార్థులను బెదిరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు మరచి కొత్త హెలికాప్టర్లలో తిరుగుతూ పోజులు కొడుతున్నారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రం నుంచి కనీసం 71 పైసలు కూడా తీసుకొనిరాలేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి రాజప్రసాదాలు నిర్మించుకొంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం తానేం తక్కువ? అనే చందంగా మధిర, ఖమ్మం, హైదరాబాద్‌లో మూడుచోట్ల మూడు ఇండ్లు నిర్మించుకొంటున్నారని ఆరోపించారు. ప్రతి ఇంటికీ ఏటా రూ. 2.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. రెండున్నరేండ్లలో ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలని నిలదీశారు.