హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సర్కారు పాఠశాల విద్యార్థుల్లో విద్యాప్రమాణాల పెంపు, కనీస సామర్థ్యాల సాధనకు గతంలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్, లిప్ కార్యక్రమాలను ఈ విద్యాసంవత్సరం సైతం కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీటి అమలులో కొన్ని మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. విద్యాప్రమాణాల పెంపుకు గత కేసీఆర్ సర్కారు హయాంలో 1-5 తరగతులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ(ఎఫ్ఎల్ఎన్), 6 -9 తరగతులకు లర్నింగ్ ఇప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం(లిప్)ను విద్యాశాఖ తలపెట్టింది. ఎఫ్ఎల్ఎన్ను తొలిమెట్టు, లిప్నకు ఉన్నతి అని నామకరణం చేశారు. అయితే ఈ ప్రోగ్రాంల్లో భాగంగా విద్యార్థులకు ప్రతి నెల పరీక్షలు నిర్వహించేవారు. కానిప్పుడు ప్రతినెల పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ముగింపు పలికింది. వీటిస్థానంలో ఆగస్టులో బేస్‌లైన్ టెస్ట్, డిసెంబర్లో మిడ్లైన్ పరీక్ష, మార్చిలో ఎండ్‌లైన్ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. సబ్జెక్టులవారీగా విద్యార్థుల పురోగతిని అంచనావేసి, నమోదుచేస్తారు. ఫలితాలను ‘తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ యాప్’లో నమోదుచేస్తారు. మండల ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారులు, హెచ్ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బడుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. తరగతి గది బోధనను పరిశీలించి, ఫీడ్‌బ్యాక్ ఇస్తారు.