హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రూపాయి ప్రాజెక్టుకు రెండు రూపాయల అప్పు తేవడం ఎక్కడైనా చూశారా? ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్రం చేస్తున్నది అదే. అది కూడా విదేశాల నుంచి రుణాలు తేవడం మోదీ ప్రభుత్వానికే చెల్లింది. రూ.64వేల కోట్లతో అమలు చేసే ‘ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ ప్రాజెక్టు కోసం కేంద్రం ఏకంగా రూ.1.37 లక్షల కోట్ల విదేశీ రుణం తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో వెల్లడించింది. అంతేకాదు.. ఈ పథకం అందరినీ ఆదుకోలేదని, కొందరికేనని వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలో కేవలం 25 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తున్నట్టు పేర్కొన్నది. దీంతో ప్రధాని మోదీ ప్రారంభించిన గొప్ప పథకమంటూ ఊదరగొడుతున్న ఆయుష్మాన్ భారత్ ‘అప్పుల కుప్ప’ అని, విదేశాల నుంచి రుణాలు తెచ్చి అమలు చేస్తున్నామని స్వయంగా కేంద్రమే అంగీకరించినట్టయ్యింది.
ఖర్చుకు రెట్టింపు అప్పు
ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ‘ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.64 వేల కోట్లతో 2025-26 నాటికి వైద్యరంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని గొప్పగా చెప్పుకొన్నది. ఈ పథకం అమలుకు ఏమైనా అప్పులు తెస్తున్నారా? అని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించగా.. కేంద్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ పథకాన్ని అప్పులు తెచ్చి అమలు చేస్తున్నట్టు ఒప్పుకొన్నది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి సుమారు రూ.25 వేల కోట్లు (300 మిలియన్ డాలర్లు), జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి సుమారు రూ.30 వేల కోట్లు (500కోట్ల యెన్స్) రుణాలు తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాదు.. వీటికి అదనంగా ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) నుంచి రూ.82 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నది. అంటే.. రూ.64వేల కోట్లతో అమలు చేసే ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.1.37 లక్షల కోట్ల అప్పు తీసుకుంటున్నట్టు స్వయంగా కేంద్రమే వెల్లడించింది.
నాలుగో వంతు మందికే వర్తింపు
ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా ఆరోగ్యశ్రీ వందపాళ్లు నయమని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తుంటారు. అందుకే చాలాకాలంపాటు ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయలేమని చెప్పారు. కేంద్రం ఒత్తిడి తేవడంతో చివరకు గతేడాది మే నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌ను కలిపి అమలు చేస్తున్నారు. ఈ పథకంతో పెద్దగా ప్రయోజనం లేదని తాజాగా పార్లమెంట్లో కేంద్రం చెప్పిన లెక్కలే స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలో కేవలం 25లక్షల 90వేల కుటుంబాలకు మాత్రమే ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుందని కేంద్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం దాదాపు 90 లక్షల కుటుంబాలకు అండగా నిలుస్తుండగా.. కేంద్ర పథకం అందులో నాలుగోవంతు కుటుంబాలకు మాత్రమే వర్తిస్తున్నది. ఆరోగ్యశ్రీలా కాకుండా ఆయుష్మాన్ భారత్ పథకానికి కఠిన నిబంధనలు ఉండటమే ఇందుకు కారణం. అయినా రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఈ పథకం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ‘ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో ఎందుకు అమలు చేయరు?’ అంటూ ఇప్పటికీ ప్రశ్నిస్తుంటారు. తెలంగాణలో గతేడాది నుంచి అమలవుతున్నా.. కేంద్రమే అనేకసార్లు చెప్పినా ఆయన అవగాహన పెంచుకోకపోవడం మరీ విడ్డూరం.