హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): విద్యా, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు కృషిచేయాలని తెలంగాణ బీసీ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గువ్వల భరత్‌కుమార్‌తోపాటు పలువురు నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం హర్షించదగిన విషయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించిన అన్ని పార్టీల ప్రతినిధులు, నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. చట్టాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు రాజ్‌కుమార్, వినయ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.