RRR | హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూసేకరణ కోసం ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు ఆదివారంతో పూర్తయింది. కానీ, పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగానే ఉన్నది. ఆరు నెలల క్రితం నాటి పరిస్థితే నేటికీ కొనసాగుతున్నది. ఇంకా 20% భూమిని సేకరించాల్సి ఉన్నది. ఈ భూసేకరణకు జాతీయ రహదారుల శాఖ నోటిఫికేషన్ జారీచేసి చేతులు దులుపుకోవడం, రైతుల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత, కోర్టు కేసుల వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు. ట్రిపుల్ఆర్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉన్నది. అందులో భాగంగా సీఎం రేవంత్రెడ్డి తరచూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. సెప్టెంబర్ 15లోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆగస్టులో గడువు నిర్దేశించారు.
మొత్తం 348 కి.మీ. పొడవైన ట్రిపుల్ఆర్ నిర్మాణానికి దాదాపు 10 వేల ఎకరాల భూములు అవసరమవుతాయి. అందులో 158.65 కి.మీ. పొడవైన ఉత్తర భాగం నిర్మాణానికి సుమారు 4,600 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 3,500 ఎకరాలు మాత్రమే సేకరించారు. మిగిలిన 1,000 ఎకరాల్లో దాదాపు 200 ఎకరాలు అటవీ భూమి ఉండటంతో దానికి దీనికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు గుర్తించారు. మిగిలిన చోట్ల భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. భూసేకరణ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ధరకు మూడు రెట్లు అధికంగా చెల్లించేందుకు ఎన్హెచ్ఏఐ సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు ససేమిరా అంటున్నారు. ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వం అర్బిట్రేషన్ను ఏర్పాటు చేసినప్పటికీ బహిరంగ మార్కెట్లో భూముల ధరలకు, ఎన్హెచ్ఏఐ నిర్ణయించన ధరలకు పొంతన లేకపోవడంతో చర్చలు ముందుకు సాగడంలేదు. ట్రిపుల్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి ఇంకా 20% భూసేకరణ పెండింగ్లో ఉన్నదని, ఇది పూర్తయ్యాకే టెండర్ల ప్రక్రియ చేపడతామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెప్తున్నారు.
ట్రిపుల్ఆర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో నష్టపరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకునేందుకు కలెక్టర్లు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రైతులను సంతృప్తిపర్చడం సాధ్యంకాదని నిర్ధారణకు వచ్చిన అధికారులు.. చట్టంలో ఉన్న వెసులుబాటును ఆధారంగా చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న ప్రస్తుత రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలిపారు. ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ను మార్చుతామని అప్పట్లో వారికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు బలప్రయోగం ద్వారా భూసేకరణకు సన్నాహాలు చేస్తున్నారన్న వార్తలు రైతులకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.