హైదరాబాద్, జూలై 12(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం ఇలాగే కొనసాగితే ఈ వానకాలంలో వరి సాగు విస్తీ ర్ణం 30 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాలకే పరిమితమయ్యే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత వానకాలంలో 1.4 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, అందులో 70 లక్షల ఎకరాల్లో వరి సాగైందని పేర్కొన్నారు. ఈ వానకాలం లో ఎల్ నినో పరిస్థితులు ఉన్నా, ఇప్పటికే 60లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేసినట్టు వివరించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ఆధారంగా చేసుకొని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కంటింజెన్సీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. దీనిపై సోమవారం ఇక్రిశాట్లో వ్యవసాయ, ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తలతోపాటు ఇక్రిశాట్, ఐఐవోఆర్, ఐఐఎంఆర్, సీఆర్ఐడీఏ శాస్త్రవేత్తలు, ఐఎండీ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ, భూగర్భ జల విభాగం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని, జూలై 15నుంచి అమలు చేయాల్సిన ప్రణాళికపై మరోసారి సమీక్షిస్తామని తెలిపారు.