Rain Alert : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. బంగాళాఖాతం (Bay of Bengal) లో మరో అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్‌తోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఇక రానున్న నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాయలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శనివారం ఏపీలోని ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.