TS Weather | తెలంగాణలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే ఎండ 40 డిగ్రీలకు చేరుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీలకు చేరువయ్యాయి. అదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. ఫలితంగా జనం ఉక్కపోత, చెమటతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రాగల ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నెల 5వ తేదీ వరకు వేడి, తేమ కారణంగా అసౌకర్యమైన వాతావరణం పలు జిల్లాల్లో ఏర్పడుతుందని తెలిపింది. నిర్మల్ జిల్లా వనల్పహాడ్, నర్సాపూర్(జీ) గ్రామాల్లో అత్యధికంగా 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది. జైనా (జగిత్యాల) 43.4, మాడుగులపల్లి (నల్గొండ) 43.4, నేలకొండపల్లి (ఖమ్మం) 43.3, లీలా (జోగులాంబ గద్వాల) 43.2, గుబ్బగుర్తి (ఖమ్మం) 43.1, మాటూరు (నల్గొండ) 43.1, పులిచెర్ల (నల్గొండ) 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించింది.