హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసే (Heavy Rain) అవకాశముందని (Rain Alert) వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదురోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని.. 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో 13,14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, మిగతా అన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్న నేపథ్యంలో బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈనేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న క్రమంలో ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని తెలిపింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డీఆర్డీఎఫ్, పోలీస్ సిబ్బందికి ముందస్తు హెచ్చరికలు జారీచేసినట్టు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.