హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలుపడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
13వ తేదీ నుంచి 15వ తేదీ ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయని టీఎస్‌డీపీఎస్ వివరించింది.