హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ అధ్యయన సంస్థలు తాజాగా అంచనా వేశాయి. దేశ వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలపై ‘సైమెట్’ వెదర్ అంచనా వేసింది. ఈ ఏడాది దీర్ఘకాల సగటు(ఎల్పీఏ)లో కేవలం 90 నుంచి 95% వర్షపాతం మాత్రమే కురిసే అవకాశం ఉన్నదని పేరొన్నది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, ఇది వానకాలం సాగుపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణం ‘ఎల్‌నినో’ ప్రభావమేనని సైమెట్ స్పష్టంచేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగడం వల్ల ఏర్పడే ఈ పరిస్థితి, భారత ఉపఖండంలో వర్షాలను తగ్గిస్తుందని, రుతుపవనాల ప్రారంభ దశలో ఇది మొదలై, ఏడాది చివర వరకు మరింత బలంగా మారే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రస్తుతానికి ఇవి ప్రైవేట్ సంస్థ అంచనాలు మాత్రమే.
భారత అధికారిక వాతావరణశాఖ తన నివేదికను త్వరలో విడుదల చేయనున్నది. వెస్ట్‌బెంగాల్ నుంచి ఒడిస్సా, తెలంగాణ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని, అదే విధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలోని దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో కొనసాగిన మరో ఆవర్తన ద్రోణి మంగళవారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాబోయే 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఎటువంటి భారీ మార్పులు ఉండబోవని, ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. మంగళవారం 19 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీచేశారు.