హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 307లో దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా బదిలీ చేశారని, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ‘ధరణి’ పోర్టల్‌లో ఆ భూమిని ఎమ్మెల్యే గాంధీ కుటుంబసభ్యుల పేరిట చేర్చిందని బీఆర్ఎస్ నేత ఆర్ లక్ష్మారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని తీవ్రమైన చర్యగా పరిగణించాలని, ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. సర్వే నంబర్ 307లోని 441 ఎకరాల్లో సీలింగ్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని, మిగిలిన ప్రైవేట్ భూమిలో ఇప్పటికే పూర్తిగా ఇండ్లు వెలిశాయని పిటిషనర్ వివరించారు. ప్రస్తుతం అక్కడ ప్రైవేట్ భూమి లేదని, తమ పేరిట ఉన్న 11 ఎకరాలు ఎప్పుడో విక్రయించి వెళ్లిన జా హెద్ బేగం, షేక్ ఇమామ్, ఇశాన్ అమీన్‌ను తీసుకొచ్చి వారి భూమిని కొన్నట్టు చూపుతూ మోసానికి తెర తీశారని తెలిపారు.
వాస్తవంగా ఆముగ్గురి పేరిట ఎలాం టిభూమి లేకపోయినా అక్రమ రిజిస్ట్రేషన్లతో 11 ఎకరాలను స్వాహా చేసేందుకు పథకం రచించారని వివరించారు. ఆ 11 ఎకరాలు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ భూమేనని పేర్కొంటూ.. ‘ధరణి’లో అక్రమంగా చేర్చిన పేర్లను తొలగించాలని, ఇటీవల ఆర్డీవో జారీచేసిన నాలా ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని, ఆ 11 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని కోరారు. పిటిషన్లో ఎమ్మెల్యే గాంధీ భార్య శ్యామలదేవి, కుమార్తె నందిత, మరో ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులతోపాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆర్డీవో, కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌ను ప్రతివాదులుగా పేరొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్.. అక్రమ భూబదిలీపై కు త్బుల్లాపూర్ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేయాలని, ఒకవేళ ఆయన చర్యలు చేపట్టకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. అనంతరం ఎమ్మార్వోకు ఫిర్యాదు చేసే నిమిత్తం తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపడంతో అందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.