Manjeera River | బోధన్, మే 13: నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లోని మంజీర తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. బోధన్ మండలం సిద్ధ్దాపూర్లోని మంజీర తీరంలో ఇసుక క్వారీలో అడ్డూ అదుపులేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతల అండ ఉందనే ధీమాతో అనుమతులు లేకపోయినప్పటికీ.. ఇసుకాసురులు అక్రమ దందా సాగిస్తున్నారు. మంజీర నదీ గర్భంలోకి చొచ్చుకుపోయి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాల జరుపుతున్నా రు. కొన్ని నెలలుగా ఖండ్గావ్ క్వారీలో నిబంధనలను బేఖాతర్ చేస్తూ ఇసుక తవ్వకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్వారీ ద్వారా ఇప్పటికే ఇసుకాసురులు అక్రమంగా రూ.కోట్లు సం పాదించారు. తాజాగా వారి కన్ను సమీపంలోని సిద్ధాపూర్ క్వారీపై పడింది. వాస్తవానికి ఈ క్వారీలో అప్పుడప్పుడు స్థానిక అవసరాల కోసం ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చేవారు. మొదట్లో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించగా.. ఇప్పుడు టిప్పర్ల ద్వారా రవాణా చేస్తున్నారు. రెండు క్వారీల్లో ఇసుక తవ్వకాలు ఏకకాలంలో చేపడుతుండటంతో టిప్పర్లు వచ్చి క్యూ కడుతున్నాయి. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
సిద్దాపూర్, ఖండ్గావ్ క్వారీలో కూలీలతో తవ్వకాలు చేపట్టాల్సి ఉన్నా జేసీబీలను వినియోగిస్తున్నారు. సెలవు రోజు ల్లో రెవెన్యూ అధికారులు వేబిల్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇటీవల సెలవు రో జున ఖండ్గావ్ క్వారీలో జేసీబీతో ఇసుకను తవ్వుతున్న దృశ్యం ‘నమస్తే తెలంగాణ’ విజిట్లో బయటపడింది. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఇక్కడి మంజీర తీరంలో ఇష్టమొచ్చినట్టుగా ఇసుక తవ్వుతున్నారు. రోడ్లు దెబ్బతినడమే కాక, లారీల వేగంతో రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు.