Illegal Mining | కీసర, సెప్టెంబర్ 28: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం భోగారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బినామీలు అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు. పోలీస్, రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం సాగుతున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కీసర మండలంలోని భోగారం నుంచి చర్లపల్లి వరకు రోడ్డు పనులను పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు అప్పగించినట్టు తెలిసింది. రోడ్డు పనులకు అవసరమైన మట్టిని భోగారంలోని తిరుమల ఇంజినీరింగ్ కళాశాల వెనుక భాగంలోని గుట్టల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మట్టిని తరలించడమే కాకుండా గ్రామంలోని చెరువులు, కుంటలు, కాలనీలోని రోడ్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు లారీలను ఇదే ప్రాంతంలోని ఎన్ఎఫ్సీ ఎంప్లాయిస్ కో-ఆపరేటింగ్ హౌసింగ్ సొసైటీ వారు, కాలనీవాసులు కలిసి అడ్డుకున్నారు. మట్టి అక్రమ తరలింపుపై సొసైటీ అధ్యక్షుడు రూప్సింగ్, సెక్రటరీ లక్ష్మణ్‌నాయక్, కోశాధికారి వసంత్‌రావు కీసర సీఐ వెంకటయ్య, తహసీల్దార్ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు నాలుగు లారీలు, హిటాచీ, జేసీబీలను స్వాధీనం చేసుకున్నారని, అయితే ఉన్నతాధికారులు, మంత్రుల నుంచి ఫోన్లు రావడంతో వాటిని వదిలేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.