Mulugu | ములుగు, జూన్ 7 (నమస్తేతెలంగాణ) : రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వక్రబుద్ధి చూపాడు. వచ్చే జీతం చాలదని అక్రమ సంపాదనపై కన్నేశాడు. తాను విధులు నిర్వర్తిస్తున్న శాఖనే అక్రమార్జనకు వాడుకున్నాడు. అసలు భూమి లేకున్నా 9 ఎకరాలను తన తల్లి పేరిట పట్టా చేయించి, రైతుబంధు డబ్బుల కాజేస్తున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో వెలుగు చూసింది. గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన గద్దల రాజు పదేండ్ల కిందట వారసత్వ ఉద్యోగం కింద తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో చేరాడు. మొదట వీఆర్ఏగా పనిచేశాడు. 2018లో తహసీల్దార్ రవిరాజ్‌కుమార్ ద్వారా తన తల్లి గద్దల చిలకమ్మ పేరుపై భూమి నమోదు చేయించుకొన్నాడు. కర్లపల్లి పరిధిలోని సర్వే నంబర్ 175లో 5ఎకరాలు, లక్నవరం శివారులోని 556 సర్వే నంబర్లో 4ఎకరాలున్నట్టు మొత్తం తొమ్మిదెకరాల భూమికి పట్టా పాస్ పుస్తకం పొందాడు. 2018లో రైతుబంధు పథకం ప్రారంభమైనప్పుడు పాస్ పుస్తకంతో దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి ఏటా రూ.90 వేలు పొందుతూ అక్రమార్జనకు తెగబడ్డాడు.
గోవిందరావుపేట మండలంలో ఒక్కో సర్వే నంబర్ మీద 300 నుంచి 500 ఎకరాల భూమి ఉంటుంది. రైతుబంధు పథకంలో సొమ్మును దక్కించుకునేందుకు నాడు తహసీల్దార్‌గా పనిచేసిన రవిరాజ్కుమార్తో పాటు కింది స్థాయి ఉద్యోగులు ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.10వేలు వరకు ఇచ్చి వారికి ఆ యా సర్వే నంబర్లలో భూమిని నమోదు చేసి.. పట్టాపాస్ పుస్తకాలను మంజూరు చేశారు. మండలంలోని పలు రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగుల నుంచి మొదలుకొని వివిధ వర్గాలకు చెందిన పలువురు అక్రమంగా భూ మిని నమోదు చేయించుకొని పట్టా పాస్ పుస్తకాలు పొంది రైతుబంధు పొందుతున్నట్టు స్థానికంగా చర్చ జరుగుతున్నది. ఇంచర్ల శివారులోని రామప్ప చెరువు శిఖం భూముల్లోనూ చాలా మంది పట్టాలు చేయించుకున్నారు. వారికి సర్వే నంబర్, పట్టా పాస్‌పుస్తకం తప్ప ఏమీ తెలియని పరిస్థితి. కలెక్టర్ స్పందించి జిల్లావ్యాప్తంగా ఇలాంటివారి వివరాలను సేకరిస్తే ఎన్నో అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉన్నది. భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వెంకటాపూర్, జూన్ 7: భూ సర్వేకు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రైతు బోల్లవేన వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో రైతు వీరస్వామికి ఐదెకరాల పట్టా భూమి ఉన్నది. అదే సర్వే నంబర్లతో మరొకరు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాడని తెలిసి వీరస్వా మి.. తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్‌ను క లువగా రూ.లక్ష ఇస్తే నీ భూమి నీకే ఉంటుందని డిమాండ్ చేశారు. దీంతో వీరస్వామి అప్పు చేసి చెల్లించినా సర్వే చేయలేదు. మళ్లీ అడిగితే తహసీల్దార్‌ను కలువాలని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.