e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home తెలంగాణ బంధంకొమ్ము బందీ

బంధంకొమ్ము బందీ

  • గొలుసుకట్టు చెరువుల్లో అక్రమ నిర్మాణాలు
  • కాలువలు పూడ్చేసి మరీ కబ్జా పర్వాలు
  • యథేచ్ఛగా ఐదంతస్తుల టవర్‌ నిర్మాణం
  • ఎన్వోసీ లేకుండానే హెచ్‌ఎండీఏ పర్మిషన్‌
  • ఉదాసీనంగా రెవెన్యూ అధికార్ల వ్యవహారం
  • సమీప కాలనీలను ముంచెత్తుతున్న వరద
  • ప్రమాదంలో పడిన అరుదైన జీవ వైవిధ్యం
  • చెన్నై ఎన్జీటీని ఆశ్రయించిన కాలనీవాసులు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలోని బంధంకొమ్ము చెరువుకు ఒకవైపు పెద్ద చెరువు, కొత్తచెరువు.. మరోవైపు కుమ్మరికుంట చెరువు గొలుసుకట్టులు. ఎగువ నుంచి వచ్చే వరద పెద్ద, కొత్త చెరువుల ద్వారా బంధంకొమ్ముకు చేరుతుంది. వర్షం కురిసినప్పుడు గుట్టల పైనుంచి వచ్చే నీళ్లు కుమ్మరికుంటలో మత్తడి దుంకుతూ బంధంకొమ్ము చెరువును నింపుతుంది. ఇలా సహజసిద్ధ ప్రవాహానికి అనుగుణంగా కాలువలు కూడా ఉన్నాయి. ఏటా జలకళతో ఉట్టిపడే ఈ చెరువుల చుట్టూ పర్యావరణం అలరారడంతోపాటు, అరుదైన విదేశీ పక్షులు ఇక్కడ కనువిందు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో 2016లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ప్రాంతాన్ని జీవవైవిధ్య (బయోడైవర్సిటీ) ప్రాంతంగా గుర్తించింది. ప్రకృతిపరంగా ఏర్పడిన ఈ జీవవైవిధ్య ప్రాంతం మనుగడకు తాజాగా ముప్పు వాటిల్లుతున్నది. గొలుసుకట్టు సాఫీగా సాగేందుకు సర్వేనంబర్లు 276, 277, 314, 315లో కాలువలు (ఫ్లడ్‌ఫ్లో చానెల్స్‌) ఉన్నట్టు గ్రామనక్షా (రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌)లో స్పష్టంగా ఉన్నది. కానీ, ఒక నిర్మాణ సంస్థ కొత్తచెరువు- బంధంకొమ్ము చెరువు మధ్య ఉన్న కాలువలను మట్టితో పూడ్చి.. వరదను మళ్లించేందుకు బాక్స్‌టైప్‌ డ్రైన్లను నిర్మించింది. దీనిపై ఐదంతస్తుల భవన నిర్మాణాన్ని చేపడుతున్నది. గత నెల కురిసిన భారీ వర్షాలతో కొత్తచెరువు నుంచి వచ్చిన వరదకు బాక్స్‌టైప్‌ డ్రైన్ల పరిమాణం ఏమాత్రం సరిపోకపోవడంతో కాలువకు ఇరువైపులా ఉన్న కృష్ణభగవాన్‌, గ్రీన్‌హౌస్‌ కాలనీలు నీటమునిగిపోయాయి. దీనిపై కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో ఆగస్టులో చెన్నైలోని ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎన్జీటీ.. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

ఎఫ్‌టీఎల్‌ పరిధి గల్లంతు

కాలువలే కాకుండా వాటికి ఇరువైపులా బఫర్‌జోన్‌లోనూ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు. కానీ, అమీన్‌పూర్‌ పరిధిలో పెద్దచెరువు, కొత్త చెరువు, బంధంకొమ్ము చెరువుల శిఖంను సైతం ఆక్రమించి భారీ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మాణాలతో ఎఫ్‌టీఎల్‌ పరిధులూ గల్లంతయ్యాయి. అధికార యంత్రాంగం వెంచర్లు, భారీ నిర్మాణాలకు అనుమతులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేయకుండా, నీటివనరులు, బఫర్‌ జోన్లు ఉన్నాయా? అనే దానిపై మాస్టర్‌ప్లాన్‌, రెవెన్యూ నక్షాలను క్షుణ్ణంగా తనిఖీచేయకుండా అనుమతుచ్చారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ నియమించిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపింది. అడిషనల్‌ కలెక్టర్‌ వీరారెడ్డి నేతృత్వంలోని కమిటీ చెరువును సందర్శించి నీటి కాలువలను పూడ్చినట్టు ప్రాథమికంగా గుర్తించింది.

ఎఫ్‌టీఎల్‌కు రక్షణ కల్పిస్తాం: కలెక్టర్‌

- Advertisement -

చెరువులు, కుంటలు, నాలాలను అక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. అమీన్‌పూర్‌ పరిధిలోని చెరువులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువు కాలువలను పూడ్చి నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలువల పూడ్చివేతపై ఇరిగేషన్‌ అధికారులు త్వరలో నివేదిక అందజేస్తారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌, మండల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలోని భూములు బఫర్‌ జోన్‌లో ఉన్నాయని, వాటిని ఎవరు కొనుగోలుచేసినా నష్టపోతారని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధి భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana