పెద్దపల్లి/టేకుమట్ల, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మానేరు నదిపై అక్రమ వసూళ్ల దందాకు తెరపడింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి మానేరు నదిలో మట్టి రోడ్డుపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కొంతకాలంగా సాగుతున్న వసూళ్ల దందాపై ‘దర్జాగా దారి దోపిడీ..’అనే శీర్షికన నమస్తే తెలంగాణ మెయిన్‌లో ప్రచురితమైన కథనం ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సంచలనం రేపింది. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు ఉదయాన్నే ముత్తారం మండలం ఓడేడ్ మానేరు నదీ తీరానికి మంథని సీఐ రాజుగౌడ్, ఆర్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసూలు చేస్తున్న టోల్ గేట్‌ను తొలగించారు.
ఇక్కడ ఎలాంటి వసూళ్లకు పాల్పడ వద్దని, ఉచితంగానే రాకపోకలు సాగించేలా చూడాలని నిర్వాహకులను హెచ్చరించారు. అక్రమ టోల్ గేట్‌ను తొలగించడంతో ఆయా గ్రామాల ప్రజలకు వసూళ్ల బెడద తప్పింది. ఉచితంగా రాకపోకలు సాగించేందుకు కృషి చేసిన నమస్తే తెలంగాణకు ఆయా గ్రామాల వారు కృతజ్ఞతలు తెలిపారు.