Toll Charges | టేకుమట్ల, ఫిబ్రవరి 28: ప్రభుత్వాలతో ఒప్పందాలపై జాతీయ, రాష్ట్రీయ రహదారులపై టోల్గేట్లు ఏర్పాటు చేస్తుంటారు. రవాణా వాహనాల నుంచి నిర్ణీత మొత్తంలో నగదు వసూలు చేస్తుంటారు. దీనికి రోడ్డు నిర్మాణంలో భాగస్వాములైన సంస్థలకు నిబంధనల మేరకు నగదు వసూలుకు హక్కులు కల్పిస్తారు. అలాంటి టోల్‌గేట్‌ను పోలినట్టే ఏర్పాటు చేసి ఓ ముఠా దర్జాగా వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు దిగింది. కాకుంటే వాగులో మట్టిపోసి ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో మహారాష్ట్రను అనుసంధానం చేసే అంతర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మానేరు వాగుపై అనుమతి లేకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా ఇలా దారి దోపిడీ చేస్తున్నారు. అరకొరగా మట్టి పోసి డబ్బు దండుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కలికోటపల్లి-పెద్దపల్లి జిల్లా ఒడేడు మధ్య మానేరు వాగు ఉన్నది. ఆ వాగులో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి మట్టి రోడ్డు పోసి టోల్‌చార్జి పేరిట వాహనదారుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క వాహనానికి రూ.30 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు. ఎండోమెంట్‌కు సంబంధం లేని గుడి పేరున ఈ దందా చేపడుతున్నారు.
బీఆర్ఎస్ హయాంలో వంతెన పనులు
మానేరు వాగుపై వంతెన నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కొంత మేర జరిగి నిలిచిపోయాయి. ఆనాడు ఉచిత రవాణా సౌకర్యమే ఉండేది. ఇది వసూల్ రాజాలకు వరంగా మారింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్ వంతెన పనులు వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తూ టేకుమట్లలోని ప్రజాసంఘాల నాయకులు మానేరు వంతెన నిర్మాణ సాధన కమిటీని ఏర్పాటు చేసి హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడంపై ప్రయాణికలు మండిపడుతున్నారు.
ప్రజాప్రభుత్వంలో ప్రైవేట్ వ్యక్తుల దందా?
ప్రజాప్రభుత్వం అంటూ ప్రైవేట్ వ్యక్తుల దందా ఏంటి? మంత్రి నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతంలో ఇలా జరగడం బాధాకరం. రోజూ వందల సంఖ్యలో వాహనదారులు దుమ్ము రోడ్డుపై ప్రయాణం చేసి డబ్బు కట్టి ఆర్థికంగా నష్టపోతున్నారు. వసూళ్ల వల్ల ఆర్టీసీ బస్సులు నడవడమే లేదు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవ తీసుకొని వంతెన పనులు ప్రారంభించి, రోడ్డుపోసి రవాణా సౌకర్యం కల్పించాలి. ఆర్టీసీ బస్సులను నడపాలి.
-నేరెళ్ల రామకృష్ణ, బీఆర్ఎస్ కార్మిక శాఖ టేకుమట్ల మండల అధ్యక్షుడు