మహబూబాబాద్ రూరల్, మార్చి 29 : కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల నమస్తే తెలంగాణ విలేకరి కొండా సతీశ్‌పై అక్రమ కేసులు నమోదు చేసి మానుకోటలోని సబ్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో శనివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి దయాకర్‌రావు సబ్‌జైలులో జర్నలిస్టు సతీశ్‌ను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా పత్రికల్లో రాసే రిపోర్టర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చ ర్యలకు పాల్పడుతూ కేసులు నమోదు చేస్తున్నదన్నారు. ఇటీవల పెద్దవంగర పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో పోలీసులు కలిసి మందు పార్టీ చేసుకున్నారని, దీనిపై సతీశ్ వెలుగులోకి తేగా.. డీజీపీ స్పందించి ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారని తెలిపారు. ప్రజలు, జర్నలిస్టులు ఐక్యంగా నిలిచి ఇలాంటి కేసులను వ్యతిరేకించాలని కోరారు. జర్నలిస్టు సతీశ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.