సంగారెడ్డి, జూన్ 17(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన మరో బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద గ్రామానికి చెందిన అశోక్‌కుమార్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి హామీలు నిలబెట్టుకోకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై సోషల్‌మీడియా వేదికగా ఆయన ఇటీవల ప్రశ్నించారు. ఆ పోస్టులపై జహీరాబాద్ పట్టణానికి చెందిన ఎన్ఎస్యూఐ కార్యకర్త నరేశ్ స్థానిక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద ఓ దవాఖానలో ఉన్న అశోక్‌కుమార్ వద్దకు మఫ్టీలో వచ్చిన పోలీసులు.. అమాంతం అశోక్‌కుమార్‌ను లాక్కెళ్లి ప్రైవేట్ వాహనంలో పడేసి జహీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అరెస్టుకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత ఒత్తిడి మేరకు పోలీసులు ఆగమేఘాలపై వచ్చి అరెస్టు చేసినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. నరేశ్ ఫిర్యాదు మేరకు అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు జహీరాబాద్ పోలీసులు చెప్పారు. అశోక్‌కుమార్‌పై 252, 196, 335, 336(2), 340(2), 352 బీఎన్ఎస్, 66 సీ, 66 డీ, ఐటీ యాక్టు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
బీఆర్ఎస్ కార్యకర్త అశోక్‌కుమార్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. వెంటనే జహీరాబాద్ పోలీస్టేషన్‌కు వెళ్లి అశోక్‌కుమార్‌ను పరామర్శించి, పోలీస్ అధికారులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై పోస్టులు పెట్టారని అశోక్‌కుమార్‌ను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తమ పార్టీ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అశోక్‌కుమార్‌పై ఫిర్యాదు వస్తే నిబంధనల మేరకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాల్సిన పోలీసులు మఫ్టీలో వచ్చి బలవంతంగా లాక్కెళ్లడం సరికాదని చెప్పారు. అశోక్‌కుమార్‌పై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.