హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులు ఆన్లైన్ ద్వారా అందించేందుకు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా), గ్రావిటీ క్లౌడ్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ట్రస్మా ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఎడ్ ఎక్స్-21 స్కూల్ లీడర్షిప్ సమ్మిట్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలో పేదరికం కారణంగా ఐఐటీ, నీట్ కోర్సులు అభ్యసించలేనివారి కోసం ఆన్లైన్ కోచింగ్ ఇవ్వనున్నట్టు గ్రావిటీ క్లౌడ్ సంస్థ చైర్మన్ జెల్లి సుబ్బారెడ్డి చెప్పారు. గ్రావిటీ సంస్థ ద్వారా ఇప్పుడు బడ్జెట్ పాఠశాలల్లో సైతం నాణ్యమైన ఐఐటీ, నీట్ బోధన అందుబాటులోకి వచ్చిందని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్మా ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి రమణారావు, ఎడ్ ఎక్స్ కన్వీనర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.