హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఐఐటీ మద్రాస్ హైదరాబాద్‌లో రీసెర్చ్ సెంటర్‌ను నెలకొల్పనుటకు త్వరలోనే మండలితో ఎంవోయూను కుదుర్చుకోనున్నది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఇటీవలే ఐఐటీ మద్రాస్‌ను సందర్శించి, డైరెక్టర్ కామకోటితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సిలబస్‌లో మార్పులు, రీసెర్చ్ పార్క్‌లు, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న ఆయన ఐఐటీ మద్రాస్ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తున్న ప్రవర్తక్, ఎన్పీటీఈఎల్, స్వయం ప్లస్ కోర్సులపై అధ్యయనం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): మంత్రులు, కలెక్టర్, అటెండర్లు, కార్మికుల పిల్లలు అందరూ ఒకే పాఠశాలలో చదువుకునే కామన్ స్కూల్ విద్యావిధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ ప్రతినిధి బృందం శనివారం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి కోరింది. ప్రతి తరగతికి ఒక టీచర్, ప్రాథమిక స్కూళ్లకు హెచ్ఎం పోస్టును మంజూరుచేయాలని కోరారు. నేతలు అశోక్‌కుమార్, నాగిరెడ్డి, వేణుగోపాల్, కొండల్‌రెడ్డి, రవీందర్, ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.