నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట తపాలా కార్యాలయం పరిధిలోని బుట్టాపూర్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కలిపి 300 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో నుంచి 45 మంది పేర్లు సాంకేతిక సమస్యతో కడెం మండలంలోని ఉడుంపూర్ తపాలా కార్యాలయానికి వెళ్లాయి. దీంతో ఈ 45 మంది మూడు నెలలుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉడుంపూర్కు వెళ్లి పింఛన్ డబ్బులు తెచ్చుకుంటున్నారు. అక్కడికి వెళ్లిరావడానికి ఒక్కొక్కరికి దాదాపు రూ.200లకుపైగా ఖర్చవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు తమ గోడును అర్థం చేసుకుని తమ పేర్లను బుట్టాపూర్ పరిధిలోకి మార్చాలని పింఛన్దారులు కోరుతున్నారు. – దస్తురాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్లను నెలనెలా ఇవ్వకపోవడంతో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా పింఛన్ మీదనే ఆధారపడి బతుకుతున్న పండుటాకుల ఇబ్బందులు వర్ణనాతీతం. పింఛన్ డబ్బులు వస్తే మందుగోళీలు తెచ్చుకుంటామని, రెండు నెలలుగా పింఛన్ రాక ఇబ్బందిగా ఉందని వృద్ధులు వాపోతున్నారు. వితంతువులు, దివ్యాంగులు సతమవుతున్నారు. బీఆర్ఎస్ సర్కారులో నెలనెలా పింఛన్ సజావుగా వచ్చేదని గుర్తుచేశారు.