Congress | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కర్ణాటకలో కమీషన్ రాజ్‌ను నెలకొల్పి న బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ అధికారమిస్తే.. ఆదిలోనే హస్తం పార్టీ ఓటర్లకు చెయ్యింది. బీజేపీకి మించి కమీషన్ రాజ్‌ను నడుపుతున్నదని ఆరోపణలు అప్పుడు మొదలయ్యాయి. కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే ఏమవుతుందో కర్ణాటక పరిస్థితి కండ్లముందు కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా గడవకముందే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. మంత్రివర్గం రెండు గ్రూపులు గా చీలిపోయింది. సీఎం, డిప్యూటీ సీఎం మ ధ్య కోల్డ్‌వార్, పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో ప్రజలను పట్టించుకొనేవారే కరువయ్యా రు. సీఎం సిద్ధరామయ్య మొదటి కృష్ణుడు, డిఫ్యూటీ సీఎం డీకే శివకుమార్ రెండో కృష్ణు డు అంటూ జోకులు పేలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎంను గద్దె దింపటం పెద్ద పనికాదంటూ స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకటించటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.
కాంగ్రెస్ తోక వంకరే
కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారం చేపట్టి 90 రోజులు కూడా గడువలేదు. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే అవినీతి ఆరోపణలు రావటం కాంగ్రెస్‌ను కకావికలం చేస్తుండగా, మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమారే తమను 15% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక కంట్రాక్టర్ల సంఘం ఏకంగా గవర్నర్‌కే ఫిర్యాదు చేసింది. వ్యవసాయశాఖ అధికారులు కూడా ఆ శాఖ మంత్రి తమను నెలనెలా కప్పం చెల్లించాలని వేధిస్తున్నట్టు ఆరోపించారు. ఇది కూడా గవర్నర్ దృష్టికి వెళ్లడంతో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సీఎం సిద్ధరామయ్య సీఎల్పీ సమావేశం నిర్వహించినా ఫలితం లేకపోయింది. పరిస్థితి చేయిదాటే ప్రమాదమున్నదని గ్రహించిన ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 2న ఢిల్లీలో సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు ముఖ్యనేతలతో సమావేశమైంది. మంత్రులు తమకు అందుబాటులో ఉండటంలేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్‌కు ఓటు.. ఢిల్లీ చేతిలోకి రిమోటు
బీజేపీ 40 శాతం కమీషన్ సర్కారుతో విసిగిపోయిన కన్నడ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునుంచే హస్తం పార్టీలో ఆధిపత్యపోరు మొదలైంది. సీఎం పీఠం ఎవరిదన్నదానిపై అధిష్ఠానం నిర్ణయం కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ హస్తిన చుట్టూ తిరిగారు. సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించడాన్ని శివకుమార్ పైకి స్వాగతించినప్పటికీ, లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు. పరిపాలనలో అధిపత్యం కోసం శివకుమార్ తెర వెనుక గోతులు తవ్వుతున్నట్టు ఆరోపణలున్నాయి. మంత్రివర్గం కూడా రెండుగా చీలిపోయినట్టు వ్యవహరిస్తుండటం సర్కారులో కుదుపునకు కారణమైంది. అసలే అంతర్గత కుమ్ములాటలతో కుదేలైన ప్రభుత్వంపై స్వపక్ష ఎమ్మెల్యేలే అవినీతి ఆరోపణలు చేయడం, డిప్యూటీ సీఎంపై కాంట్రాక్టర్ల సంఘం నేరుగా గవర్నర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, మంత్రు ల వైఖరిని తప్పుబట్టడం సర్కారు అస్థిరతకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. ఢిల్లీ అంగట్లో మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే రిమోట్ ఢిల్లీ చేతిలోకి వెళ్తుందన్న ఆరోపణ నిజం కావడానికి మూడు నెలలు కూడా పట్టలేదని మండిపడుతున్నారు.