హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘రహవీర్’ పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు సహాయం చేసి ప్రాణాలు కాపాడిన పౌరులను ‘గుడ్ సమారిటన్స్’గా గుర్తించి రూ.25వేల నగదు ప్రోత్సాహంతోపాటు ప్రభుత్వ ప్రశంసాపత్రం అందిస్తామని వెల్లడించింది.
వారిని ‘రహవీర్’తో సతరిస్తామని తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసహాయం అందేలా ప్రోత్సహించడం, పౌరులు భయపడకుండా సహాయం చేసే వాతావరణం కల్పించడం, గుడ్ సమారిటన్లకు చట్టపరమైన రక్షణ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నది. ఈ పథకంపై జిల్లా కమిటీ ఏర్పాటు, ఎంపిక విధానంతోపాటు విసృ్తత ప్రచారం కల్పించాలని కలెక్టర్లకు సర్యులర్ జారీ చేశామని రవాణాశాఖ వెల్లడించింది.