Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్, ఇతర గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే, ఆ రైతులకు రైతు భరోసా పోయినట్టే. పవన విద్యుత్తు ప్లాంట్లకు లీజుకు ఇచ్చినా అంతే సంగతి. బ్యాటరీ స్టోరేజీ, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు ఏర్పాటు చేసినా రైతు భరోసా కోల్పోయినట్టే. ఈ ప్లాంట్లను ఏర్పాటుచేసిన స్థలాలు ఆటోమాటిక్‌గా నాలా కన్వర్షన్ అవుతాయి. వ్యవసాయ స్థలాలు వ్యవసాయేతర భూములైపోతాయి. ఏకంగా 25 ఏండ్లపాటు రైతులు స్థలాన్ని, ప్రయోజనాలను కోల్పోతారు.
రైతు భరోసా రాదు. రుణాలు కూడా తీసుకోలేరు. ప్లాంట్ కోసం 25 ఏండ్లు లీజుకు ఇవ్వాలి. ఎకరానికి ఏడాదికి లక్ష రూపాయలు లీజుగా ఖరారుచేశారు. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. అవి ప్రైవేట్, కార్పొరేట్ వర్గాలకు అనుకూలమని విమర్శలు వినిపిస్తున్నాయి. అదానీ లాంటి కంపెనీలకు రెడ్‌కార్పెట్ పర్చేందుకే ఈ పాలసీని రూపొందించారన్న వాదనలున్నాయి.