Bathukamma : దేవుళ్లను పువ్వులతో పూజించడం సహజం. కానీ పువ్వులనే దేవుళ్లుగా కొలిచే పండుగ ఒకటి ఉంది. అదే మన తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా పువ్వులను పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో పాటకు ఎంత ప్రాధాన్యం ఉండేదో.. బతుకమ్మకు కూడా అంతే ప్రాధాన్యం ఉండేది. తెలంగాణ అస్తిత్వ పోరాట చిహ్నంగా ‘బతుకమ్మ’ మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతటి ప్రాధాన్యం కలిగిన బతుకమ్మ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..
ప్రతి ఏటా ఈ బతుకమ్మ పండుగ సమీపించే సమయానికి ప్రకృతి అంతా పూలవనంగా మారుతుంది. ప్రకృతిలో సేకరించిన పూలను ప్రకృతికే సమర్పించుకోవాలనే ఉద్దేశంతో బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. నిత్యనూతనమై తెలంగాణ వాకిట్లో సిరులొలికించే ప్రకృతి పండుగ బతుకమ్మను మహిళలు భక్తి పారవశ్యంతో జరుపుకోవడం ఆనవాయితీ. శీతాకాలపు తొలిరోజుల్లో వచ్చే ఈ పండుగ వేళ వర్షాలతో జలాశయాలు కళకళలాడుతుంటాయి. రకరకాల, రంగురంగుల పువ్వులు వికసించి కనువిందు చేస్తుంటాయి.
గునుగుపూలు, తంగేడు పూలు ఎక్కడ చూసినా విరబూసి ఉంటాయి. బంతి, చేమంతి, నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సీజన్. సోంపు పూలు, టేకు పూలు కూడా ఇదే సీజన్లో లభిస్తాయి. గుమ్మడి, కట్లాయి, అల్లీపూలు ఇదే సమయంలో విరబూస్తాయి. అశ్వయుజ మాసం పెత్రమాస (మహాలయ అమావాస్య, పితృ అమావాస్య) తో బతుకమ్మ వేడుకలు ఆరంభమవుతాయి. అష్టమి వరకు కొనసాగే ఈ పండుగలో కేవలం ఆచారమే కాదు.. శాస్త్రీయత కూడా దాగి ఉంది. కొత్త బట్టలు ధరించి, ఇత్తడి తాంబూలంలో గుమ్మడి ఆకులు పరిచి, వాటిమీద తంగేడు పూలు పేరుస్తారు. తర్వాత గునుగు, బంతి, చామంతి, అడవి చామంతి, ముత్యాల పువ్వు, రుద్రాక్ష, నీల గోరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర పువ్వులను బతుకమ్మలను పేర్చడంలో వినియోగిస్తారు.
బతుకమ్మకు వాడే పువ్వులన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పూలు గొంతు, మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తాయి. గునుగు పువ్వు యాంటీ డయేరియా, యాంటీ డయోబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. బంతి పువ్వు క్రిమిసంహారిణి, దోమలను నివారించే శక్తికలిగి ఉంటుంది. చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, జీర్ణానికి ఔషధంగా వాడతారు. ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి కాలుష్య కారకాలైన బెంజిన్, అమ్మోనియా వాయువులను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది. ఇలా బతుకమ్మ పేరిట వాడే ప్రతీ పువ్వుకు అనేక ఔషధ గుణాలున్నాయి.
ఈ పువ్వులన్నింటినీ గోపురంలా పేర్చాక పైన గుమ్మడి పువ్వు గొడుగు పెడతారు. తమల పాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభసూచకం. అంతేకాదు క్రిమి సంహారిణి కూడా. ఇక దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది. క్రిములను హరిస్తుంది. బతుకమ్మల్లోని పూలకున్న ఔషధగుణాలు నిమజ్జనం సందర్భంగా నీటిని శుద్ధి చేసి, నీటి ద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి. తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగలో ఎన్నో విశిష్టతలు దాగి ఉన్నాయి. అడపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా వెల్లడిస్తారు. సంతోషాన్ని అడుగులు, చప్పట్ల ద్వారా ప్రదర్శిస్తారు.
స్త్రీల సౌందర్య ఆరాధనం, అలంకార నైపుణ్యం, కళాత్మక దృష్టి, బతుకమ్మను పేర్చడంలో ఉట్టిపడుతుంది. పండుగలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మలు పేర్చడం ద్వారా తల్లి పక్కనే పిల్ల ఉండాలనే స్త్రీమాతృ హృదయం ఎలాంటిదో అవగతమవుతుంది. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణం (పిరమిడ్ ఆకారం) లోని పసుపు ముద్ద సంతాన, సౌభాగ్య ప్రదాయిని అయిన గౌరీదేవికి చిహ్నమని పూర్వీకులు ఆడపడుచులకు అర్థమయ్యే రీతిలో చెబుతుంటారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ సాయంత్రం ఇంటి ముందు కానీ, వీధిలో కానీ, దేవాలయంలో కానీ, చెరువు దగ్గర కానీ, వాగు దగ్గర కానీ ఆడపడుచులంతా చేరి బతుకమ్మలను మధ్యలో పెట్టుకుని పాటలు పాడతారు. ఒకరు పాట చెబుతుంటే మిగతా మహిళలు వంతపాడుతారు.
ఏ రోజు ఏ బతుకమ్మ..!
ఏకంగా తొమ్మిది రోజులపాటు ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతాయి. తొమ్మిది రోజులు జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలను 9 వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేప కాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఇలా రోజుకో పేరుతో అమ్మవారిని కొలుస్తారు. ఆరో రోజున అలిగిన బతుకమ్మకు నైవేద్యం ఉండదు. కానీ మిగిలిన అన్ని రోజుల్లో రోజుకో రకం పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.