Dharmapuri Arvind | కమ్మర్పల్లి: బీజేపీకి ఓటు వేయకుంటే నరకానికి పోతారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి వ్యాఖ్యానించారు. బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన భీమ్ విజయ సంకల్ప యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి అర్వింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు మోదీ ప్రభుత్వం రుణాలిస్తుందని, ఎన్నో పథకాలను అమలు చేస్తుందని అన్నారు. బీజేపీ పెట్టిన తిండి తిని ఓటు వేయని వారు నరకానికి పోతారని వ్యాఖ్యానించారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ ప్రధాని అయ్యేది లేదని.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేసేది లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గ్యారంటీల అమలు సాధ్యమని సీఎం రేవంత్రెడ్డి అనడం.. లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మరోసారి మోసం చేసే కుట్రేనని విమర్శించారు.