హనుమకొండ చౌరస్తా/హనుమకొండ/ఖిలావరంగల్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపును వ్యతిరేకిస్తూ శనివారం కేయూ మొదటి గేటు వద్ద కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర మాట్లాడారు. తెలంగాణ రాజముద్రలో కాకతీయ తోరణాన్ని తొలగించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాజముద్రను మార్చొద్దని బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు నయీమొద్దీన్ పలువురు మైనార్టీ నాయకులతో కలిసి బాలసముద్రంలో సీఎం రేవంత్‌రెడ్డికి పోస్ట్‌కార్డులు పంపించారు. తెలంగాణ ప్రభుత్వం రాజముద్రను తొలగిస్తే ఓరుగల్లు ప్రజలను అవమానించినట్టేనని టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఠాకూర్ గణేశ్‌సింగ్ అన్నారు. తోరణం తొలగింపుపై ఖిలావరంగల్‌లో కీర్తితోరణం ఎదుట నిరసన తెలిపారు.