హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఐకమత్యం, పట్టుదలతో ముందుకు సాగితే భవిష్యత్తులో బహుజనులకు రాజ్యాధికారం సిద్ధిస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్ చందానగర్‌లో మున్నూరుకాపు సంఘం (తెలంగాణ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా జనగణన, కులగణన అనంతరం.. చట్టసభల్లో మహిళలతోపాటు ఓబీసీ రిజర్వేషన్లు అమలు కావడం అనివార్యం అని తెలిపారు. మున్నూరు కాపు సంఘంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారని, మరో మూడేండ్ల వరకు సంఘం ఎన్నికలపై ఆలోచనే లేదని, సంఘం బలోపేతానికి, అభ్యున్నతి కోసం మనమంతా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సంఘం అపెక్స్ కౌన్సెల్ సభ్యులు వీ ప్రకాశ్, సీ విఠల్, రౌతు కనకయ్య నేతృత్వంలో రాజ్యాంగం మాదిరిగా విధి విధానాలను రూపొందించినట్టు తెలిపారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మె ల్యే నన్నపనేని నరేందర్, సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో అపెక్స్ కౌన్సెల్ సభ్యులు గాలి అనిల్‌కుమార్, మీసాల చంద్రయ్య, సత్తు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.