నాగర్‌కర్నూల్, జూలై 5 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని, లేకపోతే విద్యుత్తు సబ్స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ రైతులతో కలిసి కలెక్టర్ సంతోష్‌ను కలిసి ట్రాన్స్ఫార్మర్ల సమస్యలపై చర్చించారు.
రైతులు డీడీలు కట్టినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా నిరుడు కట్టిన డీడీలకు సైతం ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 6 వేల మంది రైతులకు రైతుభరోసా అందలేదని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.