హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో ఒక్కసారి భూమి వివరాలు నమోదైతే అత్యంత సురక్షితంగా ఉంటాయని, ట్యాంపరింగ్ చేసే వీలు ఉండదని రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ధరణి పాస్‌బుక్ జేబులో ఉంటే భూమే తమ జేబులో భద్రంగా ఉన్నట్టు రైతులు భరోసాతో ఉంటున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం రెవెన్యూ పద్దులపై చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి వేముల సమాధానం ఇచ్చారు. ఒకప్పుడు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఇష్టారాజ్యంగా ఉండేదని, కొందరు అధికారులు పేర్లను ఇష్టమొచ్చినట్టు మార్చేవారని గుర్తు చేశారు. భూమి కొనుగోలు చేసిన తర్వాత రికార్డుల్లో పేరు నమోదు చేయించుకోవడానికి రైతులు కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగి వేసారేవారని, అడిగినంత లంచాలు ఇచ్చుకొనేవారని తెలిపారు. వీటన్నింటికీ ముగింపు పలకాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి.. ఒకేచోట రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగే వ్యవస్థ తీసుకొచ్చారని వివరించారు.
భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం 1.48 కోట్లు పట్టా భూములు, 78 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు, వివాదాల్లో ఉన్న భూములు 22 లక్షల ఎకరాలు తేలాయని అన్నారు. ఈ వివరాలను పొందుపరుస్తూ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చామని, ఈ క్రమంలో కొందరు రైతుల భూముల వివరాలు తప్పుగా నమోదైనట్టు ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. గ్రీవెన్స్ మాడ్యూల్స్ కింద 13 లక్షల దరఖాస్తులు వస్తే..12 లక్షలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. నిషేధిత జాబితాలోని భూములపై గ్రామస్థాయిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్టు మంత్రి వివరించారు.
రిజిస్ట్రేషన్ కష్టాలకు చెక్
50-60 ఏండ్లుగా ఒక రైతు భూమి అమ్మాలంటే పాస్‌బుక్‌లు, లింక్ డాక్యుమెంట్లు కట్టలకొద్దీ పేపర్లు మోయాల్సి వచ్చేదని, డాక్యుమెంట్లు రాయడం, న్యాయ సలహాలు తీసుకోవడం పెద్ద ప్రహసనంగా ఉండేదని మంత్రి తెలిపారు. ఇప్పుడు ధరణి పాస్బుక్కే సుప్రీం అని, పాస్‌బుక్ ఉంటే గంటలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నదని, ధరణిలో పేరుంటే వెంటనే లోన్లు మంజూరవుతున్నాయని చెప్పారు. రెండేండ్లలో ధరణి ద్వారా 24 లక్షల లావాదేవీలు జరిగాయని అన్నారు.
10 లక్షల మందికి సీఎం భరోసా
జీవో 58, 59, 92, 76, 118, సాదాబైనామాల క్రమబద్ధీకరణ ద్వారా రాష్ట్రంలోని సుమారు 10 లక్షల మంది పేదలకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల్లో గూడు ఏర్పాటు చేసుకొన్న వారిని వెళ్లగొట్టొద్దని క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చారని, జీవో 58, 59 ద్వారా సుమారు 2.5 లక్షల మందికి లబ్ధి కలిగిందని చెప్పారు. జీవో 92 ద్వారా యూఎల్సీ భూముల్లో 1,248 మందికి, జీవో 76 ద్వారా సింగరేణి భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకొన్న 20 వేల మందికి ఊరట కలిగిందని చెప్పారు. జీవో 118 కింద నగరంలో 44 కాలనీలకు లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు.
కుట్రతోనే ధరణి రద్దు డిమాండ్
ప్రతిపక్ష నేతలు రెవెన్యూ సమస్యలను ధరణి సమస్యగా చిత్రీకరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తామని చెప్తున్నదని, దీని వెనుక కుట్ర ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గణనీయంగా భూ లావాదేవీలు
స్టాంపులు,రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా 2021-22లో 8.26 లక్షల లావాదేవీలు, 2022-23లో ఇప్పటివరకు 16.50 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మూడో పెద్ద ఆదాయ వనరు అని మంత్రి వేముల వివరించారు.
8 ఏండ్లలో రహదారులపై 20 వేలకోట్లు
పేదల గృహ నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు నిధులను మళ్లిస్తున్నారని అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏండ్లలో రాష్ట్రంలో పేదల ఇండ్ల కోసం గత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు కన్నా గడిచిన 8 ఏం డ్లలో పెట్టిన ఖర్చు అధికమని వివరించారు. శాసనసభలో ఆర్అండ్బీ శాఖపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాకపూర్వం 4 లేన్ల రోడ్ల పొడవు కేవలం 669 కి.మీ. ఉంటే, 8 ఏండ్లలో 485 కిలోమీటర్లు నిర్మించామని చెప్పారు.
డబుల్ రోడ్లలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు 6,093 కి.మీ. ఉండగా,ఇపుడు 8,439 కి.మీ. చేరిందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రహదారులపై రూ.20,047 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. నదులపై బ్రిడ్జిలు గతం లో 12 ఉండగా, ఎనిమిదేండ్లలో కొత్తగా 12 బ్రిడ్జిలు నిర్మించామని అన్నారు. 8 ఏండ్లలో రాష్ట్రవ్యాప్తంగా రూ.3,140 కోట్లతో 195 భవనాలు నిర్మిస్తున్నట్టు చెప్పా రు. ఎంతో సౌకర్యవంతంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని చూసి ఢిల్లీ, పంజాబ్ సీఎంలు ఆశ్చర్యపోయారని అన్నారు. హైదరాబాద్ మలక్‌పేట నియోజకవర్గంలో ఐటీ టవర్ నిర్మాణానికి 10.18 ఎకరాలు కేటాయించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
17న సచివాలయం ప్రారంభం
అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రపటాన్ని అసెంబ్లీలో ప్రదర్శించారు.