CM KCR | భీష్ముడు, విదురుడు, చాణక్యుడు. ఒకరు.. మహాయోధుడు. ఒకరు.. నీతి కోవిదుడు. ఒకరు.. పదునైన వ్యూహకర్త. ముగ్గురూ పాలన సూత్రాలు తెలిసినవారు. సకల శాస్ర్తాలను ఆపోశన పట్టినవారు. అనేక యుద్ధాలలో ఆరితేరినవారు. అపార అనుభవ సంపన్నులు. రాజ్య క్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్నీ ఆకాంక్షించే సహృదయులు. ధర్మ పక్షపాతులు. అసలైన నాయకత్వ లక్షణాన్ని నిర్వచించగల సమర్థులు. పాలకుడి గుణగణాలను విడమరిచి చెప్ప గల వివేకులు. క్షీరనీరన్యాయం తెలిసిన విచక్షణా సంపన్నులు. భీష్మ పితామహుడి జీవితమే ఓ నాయకత్వ గ్రంథం. కురువంశాన్ని నిలబెట్టినా, ధర్మాన్ని స్థాపించినా ఆయనకే చెల్లింది. అంపశయ్యపై నుంచి తాతయ్య సాగించి నీతిబోధ.. ఓ జ్ఞానసుధ. జన్మతః దాసి సంతానమే అయినా.. నీతికోవిదుడిగా వాసికెక్కాడు విదురుడు. ఇక, చాణక్యుడు.. నడిచే యుద్ధతంత్రం. మాట్లాడే మరఫిరంగి. నందవంశ నిర్మూలన నుంచి మౌర్య సామ్రాజ్య స్థాపన వరకు.. అలుపెరుగని పోరాటం ఆయన సొంతం. ఈ ముగ్గురి సిద్ధాంతాలు, వ్యూహాలు, సూత్రాలు, బోధనలను నేటి పరిస్థితులకు కూడా అన్వయించుకోవచ్చు. సమర్థులైన నాయకుల ఎంపికలో, అర్హులైన అభ్యర్థుల వడపోతలో, మ్యానిఫెస్టోల బేరీజులో.. ముగ్గురూ పథ నిర్దేశకులే. ఓటేసే ముందు ఆ త్రిమూర్తులను తలుచుకోవాలి. వాళ్లే మన మధ్య ఉంటే.. ఎవరిని గెలిపించేవారన్నదీ విశ్లేషించుకోవాలి.
మహాభారతంలో ఉద్యోగ పర్వానికి, ఎన్నికల రాజకీయాలకు ఎన్నో పోలికలు. తెలంగాణ గడ్డ నేడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంగా మారింది. వాసుదేవ కృష్ణుడు సారథిగా పాండవ పక్షం ఒక పక్క.. దుర్యోధన, దుశ్శాసనాదులను తలపించే విపక్షాలన్నీ మరో పక్క. అక్షౌహిణుల కొద్దీ ప్రజా సైన్యమంతా కేసీఆర్ వైపు.. పొరుగు రాష్ట్రం నుంచీ తరలించిన నోట్లకట్టలు, ఢిల్లీ నుంచి ఊడిపడిన బాడుగ నేతలు మరొక వైపు. అలనాడు.. మహా సంగ్రామ సమయంలో నీతికి, రీతికి పెద్దపీట వేస్తూ విదురుడు కురుసార్వభౌముడైన ధ్రుతరాష్ర్టునికి చేసిన జ్ఞానబోధ నాయకుడి లక్షణాలను వివరిస్తుంది. పరోక్షంగా ఓటరుకు కర్తవ్య దీక్షోపదేశం చేస్తుంది.
యస్య కృతం న జానంతి మంత్రం వా మాత్రితం పరే
కృతమేవాస్య జానంతి సవై పండిత ఉచ్యతే!
.. నాయకుడు లక్ష్య సాధనకు తనదైన మార్గాన్ని ఎంచుకుంటాడు. తనవైన వ్యూహాల్ని అమలుచేస్తాడు. తను సమీకరించుకున్న బలగాన్ని మోహరిస్తాడు. అంతిమంగా అనుకున్నది సాధిస్తాడు. ఇదే విషయాన్ని ఇంగ్లిష్‌లో.. మిషన్, విజన్, వాల్యూస్, విక్టరీగా సంక్షిప్తం చేయవచ్చు. తెలంగాణ ఉద్యమ జెండాను భుజానికి ఎత్తుకునే సమయానికి.. కేసీఆర్ ఒక ఒంటరి అంకె. అయితేనేం, తనకంటూ ఓ మిషన్ ఉంది. స్పష్టమైన విజన్ ఉంది. బలంగా నమ్మిన వాల్యూస్ ఉన్నాయి. కాబట్టే, విక్టరీ వరించింది. రాష్ట్రం ఆవిర్భవించింది. ఇలాంటి మడమతిప్పని నాయకత్వమే రాజ్యానికి మేలు చేస్తుందని చెబుతాడు విదురుడు. అజ్ఞానుల చేతిలోని అధికారాన్ని, అవినీతిపరుల జేబులోని సంపదను విదురుడు పిల్లి నోట్లోని మాంసంతో పోలుస్తాడు. పంచుకోవడం నాయకుడి లక్షణం. కోడి పిల్లల్ని పొదిగినట్టు.. సంపదను పదింతలు చేయడం పాలకుడి బాధ్యత. గండుపిల్లిని గుర్తుకు తెచ్చే దండగమారి మూకలు మాత్రం అంతా తమకే కావాలంటాయి. అన్నీ తమ గల్లాపెట్టెకే చేరాలంటాయి. భూముల్ని మింగేస్తాయి. నీటిని పిండేస్తాయి. గనుల్ని గుటుక్కుమనిపిస్తాయి. పంచభూతాలను ఆక్రమించే పెనుభూతాలవి. ‘వద్దు. ఆ మార్జాల సంతతిని దగ్గరికి రానివ్వకండి’ అని హెచ్చరిస్తాడు విదురుడు.
తమ దారెరుగుట, వేగ ప
డమి, దాలిమి, విడుపు గలుగుటయు లేని ప్రభు
త్వము గలదె? వారియందీ
సుమానుషము లొకడు బట్టి చూడం గలడే?
‘తన గురించి తనకు ఎరుక ఉండాలి. దుందుడుకు స్వభావం కూడదు. కొండంత ఓర్పు అవసరం. పట్టువిడుపులు తెలిసి ఉండాలి. వాడూ పాలకుడంటే!’ అంటూ నాయకత్వానికి కొలమానాన్ని ప్రసాదించాడు ఆ మహానుభావుడు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చూపిన ఓర్పు, నేర్పు, జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే విషయంలో ప్రదర్శించిన పట్టువిడుపులు.. అన్నీ కలిసి అద్భుత ఫలితాన్ని ఇచ్చాయి. దశాబ్దాల కలను నెరవేర్చాయి.
ఏ నాయకుడైనా లక్ష్యాన్ని సాధించడానికి రెండు మార్గాలు ఉంటాయి. యుద్ధం, రాయబారం. బొగ్గుల కోసం అడవుల్ని నరికే లీడర్లకు కొదవ లేదు. ఆ బాపతు నాయకులు అధికారం కోసం సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేస్తారు. స్వార్థం కోసం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తారు. తమ ఉనికి నిలబెట్టుకోడానికి విద్వేషాన్ని లావాలా ఎగజిమ్ముతారు. అలాంటి అసుర సంతతిని దూరం పెట్టమని సలహా ఇస్తాడు విదురుడు. అదే సమయంలో శాంతికాముకుడైన పాలకుడి వ్యవహార శైలిని కూడా ఎరుకపరుస్తాడు. దండలు కుట్టేవాడు చెట్టు నుంచి పువ్వును కోసినంత సున్నితంగా, తుమ్మెద మకరందాన్ని గ్రోలినంత సజావుగా.. దక్షత కలిగిన ప్రజాపతి తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు. జనానికి ఏమాత్రం నష్టం కలిగించడు. హింసకు తావివ్వడు. ధ్వంసానికి చోటివ్వడు. ఆగ్రహాన్ని కూడా నిగ్రహంగానే వ్యక్తం చేస్తాడు. ఇలాంటివారి పాలనలో పితృత్వ భావన ఉంటుంది. ఇంటి పెద్దలా ఆలోచిస్తాడు. సంయమనంతో వ్యవహరిస్తాడు. ‘ప్రజల్ని వృక్ష సమూహంలా కలిపి ఉంచేవాడే నాయకుడు’ అంటుంది విదురనీతి. చెట్టు ఒంటరిగా ఉంటే.. ఏ ఏనుగో వచ్చి కూల్చేస్తుంది. అదే సమూహ శక్తిని తలపించే కారడవిని మదగజమైనా ధ్వంసం చేయలేదు. నాయకుడికి, ప్రజలకు మధ్య ఉండాల్సిన అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ.. పాలకుడిని పులితో, ప్రజలను అడవితో పోలుస్తాడు విదురుడు. అడవి వల్ల పులికి రక్ష. పులి వల్ల అడవికి రక్ష. కానీ కొన్ని నరహంతక మృగాలు.. అడవిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరిలోని మంచికి విదురుడు ప్రతినిధి అయితే.. చెడుకు ధ్రుతరాష్ర్టుడు ప్రతీక. మనిషి చాలాసార్లు విచక్షణ కోల్పోతాడు. అజ్ఞానాంధుడిగా మారిపోతాడు. ఆ సమయంలో.. వివేకంతో మెలగాలి. విదురుడి మార్గంలో నడవాలి. ధర్మాన్నే గెలిపించాలి. రాష్ట్ర అవతరణకు ముందున్న యాభై ఏండ్ల కౌరవ పాలన పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. సకలజనుల క్షేమానికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్నే బలపరచాలి.
గణితశాస్త్ర ఫార్ములాను తలపిస్తాయి విదురుడి బోధనలు. కోపం రెండు రకాలు, దురాశ నాలుగు రకాలు.. ఇలా పక్కా లెక్కలేసి చెప్పడం ఆయనకే చెల్లింది.
☞ సముద్ర యాత్రికుడికి ఓడ ఎలాంటిదో.. జీవన యాత్రికుడికి సత్యం అలాంటిది.
☞ ఇంద్రియ నిగ్రహంలేని రాజు.. రంధ్రం పడిన తోలుతిత్తితో సమానం. తిత్తిలోని నీళ్లన్నీ ఒలికి పోయినట్టు.. పాలకుడి ఘనత కాలగర్భంలోకలుస్తుంది.
☞ ఆపదలకు భయపడని పాలకుడిని ధురంధరుడు అంటారు. అలాంటి నేతలే మనకు కావాలి.
☞ చల్లారిపోయిన విరోధాన్ని కెలకడం రాజనీతి అనిపించుకోదు. అంతిమంగా పాలకుడికే నష్టం.
☞ ధర్మాన్ని అనుసరించే రాజు దేవతలకూ ప్రీతిపాత్రుడు అవుతాడు.
☞ వృద్ధాప్యం సౌందర్యాన్ని హరించినట్టు, అవినీతి రాజ్యాన్ని బలిగొంటుంది.
☞ ఆహారానికి ఆశపడి చేప ఇనుప గాలాన్ని మింగుతుంది. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంది. బంధుప్రీతి కూడా అంతే ప్రమాదకరం.
☞ ఏ స్త్రీ అయినా నపుంసకుణ్ని భర్తగా ఒప్పుకోదు. ఏ రాజ్య ప్రజలు అయినా అసమర్థుడిని నాయకుడిగా ఆమోదించరు.
☞ ధర్మానికి సత్యం, వేదానికి పండితులు, అశ్వానికి శిక్షణ, రాజుకు మంత్రిమండలి.. రక్ష!
☞ అధికారం అనేది బలం కాదు.. బాధ్యత.
ఒకవైపు చంద్రగుప్త మౌర్యుడిని తలపించే చంద్రశేఖరుడు. మరోవైపు.. అహంకారాన్ని, అజ్ఞానాన్ని ఒళ్లంతా నింపుకొన్న నందుల సంతతి రాబందులు. ఈ పోరాటంలో కౌటిల్యుడి సైద్ధాంతిక మద్దతు కేసీఆర్‌కే. ఎందుకంటే, అర్థశాస్త్రంలోని ప్రతి సంక్షేమ సూత్రమూ తెలంగాణలో యథాతథంగా అమలవుతున్నది. రాజకీయ వ్యూహ రచనలోనూ కేసీఆర్ చాణక్యుడికి సరిసాటి అనిపిస్తాడు.
అర్థశాస్త్రం.. ఓ చదరంగపు బల్ల. ఓ వైపు మంచి, మరో వైపు చెడు. ఆట రంజుగా సాగుతుంది. చాణక్యుడు మంచికి ప్రతినిధిగా పావులు కదుపుతాడు. చెడును నిలువరిస్తాడు. అశాంతిని తరిమేస్తాడు.
ఆటవిక న్యాయాన్ని అడ్డుకుంటాడు. తన గ్రంథాన్ని ఆయన ‘ఓం నమః శుక్రబృహస్పతిభ్యాం’ అంటూ ఆరంభించడం వెనుక కారణమూ ఇదే. బృహస్పతి దేవ గురువు. శుక్రాచార్యుడు అసురుల పురోహితుడు. మంచిచెడులకు ఇద్దరూ రెండు ప్రతీకలు. ఎన్నికలు సైతం మంచి చెడుల మధ్య జరిగే బ్యాలెట్ యుద్ధమే. కరెన్సీ ప్రలోభాలకు, కులమత ప్రభావాలకు లొంగకుండా.. దైవీశక్తులనే గెలిపించాలి. ‘పాలకుడి దండానికి నిద్ర ఉండదు’ అంటూ రాజ్యంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన తొలి బాధ్యత పాలకుడిదే అని గుర్తుచేస్తాడు చాణక్యుడు. కేసీఆర్ కూడా దండనీతికి ఎనలేని ప్రాధాన్యం కల్పించాడు. పోలీసు బలగాలను శక్తిమంతం చేశాడు. నిఘా వ్యవస్థను గట్టిపరిచాడు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాడు. కాబట్టే, పదేండ్లలో జనం కర్ఫ్యూ అనే మాటే మరిచిపోయారు. మత ఘర్షణలు మూసీలో కొట్టుకుపోయాయి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా
అవతరించింది. తెలంగాణ సర్కారుకు శాంతి భద్రతలు.. రెండు కళ్లుగా మారాయి.
అనుకున్నది సాధించడం.
సాధించినది నిలబెట్టుకోవడం.
నిలబెట్టుకున్నది విస్తరించడం.
ఆ విస్తరణ ఫలాలను ప్రజలకు పంచడం.
..చాణక్యుడి నాలుగంచెల వ్యూహాన్నే కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో యథాతథంగా అమలు చేశాడు. తొలుత ఢిల్లీని కదిలించి తెలంగాణ సాధించాడు. తొలి ఐదేండ్లలో సుస్థిరతకు పెద్దపీట వేశాడు. రెండో అయిదేండ్లలో ఆ పునాదుల మీద అభివృద్ధి పంటలు పండించాడు. ఆ ఫలాలను సంక్షేమ పథకాల రూపంలో జనానికి దోసిళ్లకొద్దీ పంచాడు. ‘ఏనుగును బంధించడానికి వేసవిని మించిన ముహూర్తం లేదు’ అంటాడు చాణక్యుడు. కారణం, ఆ సమయంలో నీటి కొరత ఉంటుంది. గజరాజు దట్టమైన అడవిని దాటి బయటికొస్తాడు. సులభంగా చిక్కిపోతాడు. ‘ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడానికి ఎన్నికల రాజకీయాలను మించిన మార్గం లేదు’ అని భావించాడు కేసీఆర్. అందుకే, తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాల్సి వచ్చిన ప్రతిసారీ రాజీనామా చేసి మరీ బరిలో నిలిచాడు. గురి చూసి కొట్టాడు. వైరి వర్గాలు గిలగిలా తన్నుకొనేలా చేశాడు.
‘ప్రజల మనసును పుస్తకంలా చదవగలిగినవాడే నాయకుడు’ అంటుంది చాణక్య సూత్రం. కేసీఆర్ ఆ విద్యలో నిష్ణాతుడు. నెర్రెలుబారిన నేలకు నీళ్లు కావాలి. కాబట్టే, ప్రాజెక్టులపై దృష్టిసారించాడు. ఎండిపోతున్న గొంతుకల దప్పిక తీర్చాలి. అందుకే మిషన్ భగీరథ తీసుకొచ్చాడు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు ఆసరా కావాలి. రైతుబంధు ప్రధాన లక్ష్యం అదే. అన్నీ జనానికి అవసరమైవే. ‘క్షీరార్థినః కిం కరిణ్యా’.. పాలు అవసరమైనవారికి ఏనుగును ఇస్తే ఏం ఉపయోగం? ఇస్తే గిస్తే పాడి ఆవు ఇవ్వాలి కానీ?.. ప్రతిపక్షాలు సరిగ్గా ఇలాంటి దండగ పనే చేస్తున్నాయి. మ్యానిఫెస్టోలతో మభ్యపెడుతున్నాయి. అబద్ధపు హామీలు గుప్పిస్తున్నాయి. ప్రజలు ఆ జిత్తులను గుర్తిస్తున్నారు. ‘బెల్లం పాకంలో ముంచినంత మాత్రాన వేపకొమ్మ మామిడికొమ్మ కాలేదు కదా’ అంటూ తీపి ముచ్చట్లతో చేరువకావడానికి యత్నించే వారికి దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు చాణక్యుడు.
‘ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి’, ‘మాకూ అధికారం ప్రసాదించండి’.. అంటూ కొన్ని పార్టీలు యాచించినంత పని చేస్తున్నాయి. ఓటును అభ్యర్థించాలి, దేబిరించకూడదు. ‘అర్థించడం వల్ల గౌరవాన్ని కోల్పోతాం’ అంటూ అలాంటి వారికి వాతలు పెడతాడు ఆచార్యుడు.
‘సువిశాలమైన సచివాలయం, సమర్థులైన మంత్రులు, దుర్భేద్యమైన రాజధాని, పుష్కలమైన ఆదాయ వనరులు, బలమైన రక్షకభట వ్యవస్థ’.. ఈ ఐదూ రాజ్యానికి అత్యంత కీలకమని విశ్లేషిస్తాడు చాణక్యుడు. కేసీఆర్‌కు కూడా ఈ ఐదు విభాగాలూ పంచప్రాణాలే.
‘ఏ ఆర్థిక వ్యవస్థకైనా వ్యవసాయమే మూలాధారం. సేద్యం బావుంటేనే.. ప్రజలకు ఆహారం, పశువులకు పోషణ, పక్షులకు గింజలు, ఖజానాకు రాశులు’ అంటూ రాజ్య పాలన వ్యవసాయ కేంద్రంగా సాగాలని నొక్కి చెప్పాడు చాణక్యుడు. కేసీఆర్ పక్కాగా ఆ మార్గంలోనే వెళ్తున్నాడు. కాబట్టే, తెలంగాణ వరిసాగులో దూసుకెళ్తున్నది. ప్రజలకు ముప్పూటలా సన్నబియ్యపు భోజనం వడ్డిస్తున్నది. పల్లెలు పశు సంపదతో కళకళలాడుతున్నాయి. వలస పక్షులు వెనక్కి వస్తున్నాయి. విదేశీ పక్షులూ చుట్టుపుచూపుగా తరలి వస్తున్నాయి. గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లాపాపలతో తిరిగి వెళ్తున్నాయి. ఇది కదా సంక్షేమ రాజ్యం అంటే! చాణక్యుడే బతికుంటే.. తెలంగాణ మాడల్‌ను స్ఫూర్తిగా తీసుకొని మరో అర్థశాస్త్రం రాసేవారు. ‘నీ మిత్రులు సర్వకాల సర్వావస్థల్లో నీ వెన్నంటి ఉంటారు. నీ శత్రువులు ఆరునూరైనా నీకు మద్దతు తెలపరు. మిగిలింది తటస్థులు. వారే కనుక నీ వెనుక నిలిస్తే.. నీకిక తిరుగులేదు’ అంటాడు చాణక్యుడు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులు, గుజరాతీలు, కన్నడిగులు, తమిళులు, మలయాళీలు.. ఇలా ఎంతోమంది కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మేధావులు, బుద్ధిజీవులు, కవిగాయక వైతాళికులు. కారు – సారు మంత్రం జపిస్తున్నారు. తటస్థుల ఓట్లు బీఆర్ఎస్కే అని సకల సర్వేలూ చెబుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది ద్విముఖ పోరూ కాదు, త్రిముఖ పోరూ కాదు. ఏకపక్ష యుద్ధం. అంతిమ విజయం ఎప్పుడో ఖరారై పోయింది. ‘మిణుగురు పురుగుల సమూహం దూరం నుంచి చూస్తే పెనుమంటలా అనిపిస్తుంది. దగ్గరికెళ్తే బండారం బయటపడుతుంది. అదే దీపం.. దగ్గరికి వెళ్లినకొద్దీ మరింత తేజో వంతంగా కనిపిస్తుంది’ అంటూ ఓ చక్కని ఉపమానాన్ని జోడించాడు చాణక్యుడు. తెలంగాణ రాజకీయాల్లో మిణుగురుల మిడిసిపాటు ఎవరిదో, దీపకాంతి ఎవరిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు.
మౌర్య సామ్రాజ్యం మొదలు నిన్నమొన్నటి సంస్థానాల వరకు.. ఆర్యావర్తంలో చాణక్యుడి అర్థశాస్త్రమే పాలన గ్రంథం. ఆ సూత్రాల ఆధారంగానే ధర్మబద్ధమైన పాలన సాగింది. ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడిపారు.
☞ సింహం ఎంగిలి మెతుకులు ఇష్టపడదు. నిజమైన పాలకుడు దొడ్డిదారి సంపాదనకు ఆశపడడు.
☞ రాజు మితంగా భోంచేయాలి, అమితంగా ఆలోచించాలి. అతి తిండి వల్ల మగత కమ్ముతుంది.
☞ ప్రియవాదినో న శత్రుః.. నోరు మంచిదైతే రాజ్యమూ మంచిది అవుతుంది.
☞ యో యస్మిన్ కర్మణి కుశలః తం తస్మిన్నేవ నియోజయేత్ .. ఎవరు ఏ రంగంలో ప్రవీణులో, వారికే ఆ బాధ్యతనివ్వాలి.
☞ అధికారం రాజధాని నుంచి పల్లెకు విస్తరించాలి. సంపద పల్లెల నుంచి మొదలుపెట్టి పట్టణాల మీదుగా రాజధాని చేరాలి.
☞ విభావానురూపం ఆభరణః.. మనం ధరించే వస్ర్తాలు మన ఆర్థిక స్థితికి మించి ఉండకూడదు.
☞ మూర్ఖులతో శత్రుత్వం ప్రాణాంతకం. మిత్రులతో గొడవలు నష్టదాయకం. గురువులతో వైరం పతనానికి సంకేతం.
☞ తపస్సుకు ఒంటరిగా.. విద్యలకు ఇద్దరితో, సంగీతం నేర్చుకోవడానికి ముగ్గురితో, కొత్త ప్రదేశానికి నలుగురితో, సేద్యానికి ఐదుగురితో, పోరాటానికి పదిమందితో వెళ్లాలి.
☞ బాణం ఒక ప్రాణాన్ని బలిగొంటుంది, వ్యూహం పదివేలమందిని ఒకేసారి నేల కూలుస్తుంది.
☞ నేలమీది మొసలిని ముసలి కుక్క కూడా బరబరా లాక్కెళ్లిపోతుంది. అదే మొసలి మడుగులో ఉంటే.. మదగజాన్ని అయినా బంధించగలదు. స్థాన బలం అలాంటిది.
☞ కొన్నిసార్లు ధర్మం అధర్మంలా, అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. వివేకంతో నిర్ణయం తీసుకోవాలి.
మహాభారతం.. నాలుగువేదాలకు అయిదో రూపం. వేలకొద్దీ రుక్కుల సారం.. వందలాది పాత్రల ప్రతిరూపం. అందులోనూ భీష్మ పితామహుడు నిలువెత్తు ధర్మశాస్త్రం. పాలన విజ్ఞాన సర్వస్వం. శాంతిపర్వంలో.. ఆ సంగ్రామ యోధుడు పాండవులకు చేసిన బోధ.. ఒక విలువల రాజ్యాంగం. కొత్త నాయకుల ఎంపికకు కొలమానం కూడా. పొరపాటునో, గ్రహపాటునో అల్పబుద్ధివాడికి అధికారం ఇచ్చామా.. చచ్చామే! అదొక ఉత్పాతం. దయచేసి అలాంటి పొరపాటు చేయవద్దని ఒకటికి పదిసార్లు గుర్తు చేస్తాడు భీష్మ పితామహుడు ఓ కథ రూపంలో.. ఓ ఘోరారణ్యం. అందులో సువిశాల ఆశ్రమం. అక్కడో మహర్షి. తపోధనుడు. జీవకారుణ్యమూర్తి. సకల ప్రాణులూ ఆ ఆవరణలో నిర్భయంగా తిరిగేవి. ఆ సమూహంలో ఓ కుక్క కూడా ఉండేది. మహర్షి ఆ శునకాన్ని ప్రేమగా చూసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా వెనకాలే తోక ఊపుకొంటూ బయల్దేరేది. అదంతా చూసి ఓ పులికి కన్ను కుట్టింది. చంపుతానంటూ కుక్కను బెదిరించేది. ఆ బాధ తట్టుకోలేక.. నేరుగా మహర్షి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నది కుక్క. దీంతో ఆ రుషి పుంగవుడు.. ఆ కుక్కను పులిలా మార్చి పులిపట్ల ఉన్న భయాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత, ఏనుగులా మార్చి ఏనుగులంటే ఉన్న భయాన్ని పోగొట్టాడు. ఇంకో సందర్భంలో సింహంలానూ మార్చాడు. సరిగ్గా అప్పుడు ఆ శునకం తన కుక్కబుద్ధిని ప్రదర్శించింది. ‘ఈ రుషిని కనుక చంపేస్తే.. నేను శాశ్వతంగా సింహంలా దర్జాగా బతికేయవచ్చు కదా’ అనుకుంది మనసులో. ఆ కుట్రను గ్రహించిన మహర్షి.. క్షణమైనా ఆలస్యం చేయకుండా మళ్లీ దాన్ని కుక్కలా మార్చాడు. ఆశ్రమం నుంచి తరిమేశాడు కూడా. అర్హతలేని వారిని అందలమెక్కిస్తే.. ఆ చేయి భస్మాసుర హస్తమే! మనల్ని ముంచేస్తుంది. వద్దు. ఆ పొరపాటు చేయొద్దు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కుదుటపడుతున్నాం. పోరాడి సాధించిన తెలంగాణను ఢిల్లీ సామంతరాజ్యం చేస్తామా? కష్టపడి నిర్మించుకున్న అభివృద్ధి సౌధాన్ని పందికొక్కుల పాలు చేస్తామా? శ్రమించి పోగేసుకున్న సంపదను.. ఉత్తరాది పెద్దలకు కప్పంగా కడతామా? వద్దు. కలలోనైనా ఆ ఆలోచన వద్దు. ఇది భీష్ముడి హుకుం.
నాయకుడికి శీల సంపద ఎంత ముఖ్యమో మరో కథలో బోధిస్తాడు పితామహుడు. ఓ సారి ప్రహ్లాదుడి దగ్గరికి మారువేషంలో వెళ్తాడు ఇంద్రుడు. అతిథి సేవలతో సన్మానించి, ‘ఏం కావాలో కోరుకో దేవరాజా?’ అంటాడు ప్రహ్లాదుడు. ‘నీ శీలాన్ని నాకు ఇవ్వు’ అని కోరతాడు ఇంద్రుడు. సంతోషంగా ఇచ్చేస్తాడు ప్రహ్లాదుడు. కానీ, శీలంతో పాటు ధర్మం, సత్యం, సత్ప్రవర్తన, బలం, సంపద కూడా వెళ్లిపోతాయి. ‘ఇదేమిటమ్మా! నువ్వు కూడా..’ అని సంపదతో వాపోతాడు ప్రహ్లాదుడు. ‘శీలం లేని చోట నేనెందుకు ఉంటాను నాయనా’ అని సమాధానం ఇచ్చి ముందుకు సాగుతుంది సంపదల తల్లి. ‘కాబట్టి, పాలకులకు శీల సంపదే ప్రాణం’ అంటూ ముక్తాయిస్తాడు భీష్ముడు. ఆయా పార్టీల నాయకులను బేరీజు వేస్తున్నప్పుడు శీలాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అతని గతం తవ్వితీయాలి. నోటకు ఓటు, వెన్నుపోటు వగైరా చరిత్రలు ఉన్నాయేమో గమనించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ పాత్రాలేని అపాత్రులను ఆమడదూరం ఉంచాలి. ఆ నేతలను రిమోట్ కంట్రోల్‌తో ఆడిస్తున్న సూత్రధారులు ఎవరన్నది పసిగట్టాలి. విష వృక్షాన్ని పెకిలించినట్టు.. ఓటుతో గొడ్డలి వేటు వేయాలి. అలాంటివారిని భీష్ముడు తన కూనలను తానే చంపి తినే పులులతో పోలుస్తాడు.
కర్మలు రెండు రకాలని చెబుతాడు కురు పితామహుడు. ఒకటి.. ఇష్టకర్మలు, రెండు పూర్త కర్మలు. అగ్నిహోత్రం, తపస్సు, ఆతిథ్యం మొదలైనవి ఇష్టకర్మలు. జలాశయాలు నిర్మించడం, ఆలయాలు కట్టించడం, నిరుపేదలను ఆదుకోవడం పూర్తకర్మలు. పాలకుల ప్రధాన బాధ్యత.. పూర్తకర్మలని వివరిస్తాడు భీష్ముడు. కేసీఆర్.. అటు ఇష్టకర్మలు, ఇటు పూర్తకర్మలు సమర్థంగా నిర్వహిస్తున్న రాజయోగి. అతిసామాన్యులను కూడా తన ఇంటికి పిలిపించి కొసరి కొసరి విందులు వడ్డించిన ఉదంతాలు అనేకం. రాజ్య శ్రేయస్సు కోసం అయుత చండీ హోమాలు, రాజశ్యామల యాగాలు జరిపించే పరమ ధార్మికుడాయన. తెలంగాణ సమాజం కోసం కేసీఆర్ సాగించే అంతర్మథనమే ఓ పెద్ద తపస్సు. కాళేశ్వరం ప్రాజెక్టు, యాదగిరి గుట్ట తేజస్సు.. పూర్త కర్మల పరిపూర్ణ ఫలాలే. కాబట్టే, ‘తాతా! ఒక ఉత్తమ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమిటి?’ అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు ఆ సంగ్రామ సింహుడు ఇచ్చిన జవాబులో మనకు కేసీఆర్ వ్యక్తిత్వమే కనిపిస్తుంది. ‘నిండైన వ్యక్తిత్వం, నిష్కళంక చరిత్ర, స్థితప్రజ్ఞత, ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం, చొరవ, కార్యజ్ఞానం, కర్తవ్య జ్ఞానం’.
ఆచార్యుడి మాట మహా పదును. భావం ఎంతో లోతు. గురువు బెత్తం ఝళిపించినట్టు ఉంటుంది వ్యవహారం.
☞ నాయకుడు ముఖస్తుతికి లొంగిపోవద్దు. నిష్ఠుర సత్యాలకు కోపం తెచ్చుకోవద్దు.
☞ ఆత్మావలోకనం లేని మనిషి.. రెండు కళ్లున్నా అంధుడే.
☞ తీరని అప్పు, ఆరని నిప్పు ఎప్పుడూ ప్రమాదమే.
☞ నదీ ప్రవాహం ఒడ్డును కోసినట్టు శత్రువును క్రమంగా బలహీనపరచాలి. దెబ్బ తెలియకూడదు. గాయం మానకూడదు.
☞ మాట నిలబెట్టుకోలేని నాయకుడి కోట కూడా ఎంతోకాలం నిలబడదు.
☞ అరిషడ్వర్గాలను గెలవలేకపోతే.. ప్రజాభిమానాన్నీ సాధించలేవు.
☞ పన్నులు.. స్వచ్ఛంగా చెల్లించగలిగేంత సరళంగా ఉండాలి కానీ, బలంగా వసూలు చేసేంత భారం కాకూడదు.
☞ వృథా.. ఇంటికైనా, రాజ్యానికైనా అస్సలు మంచిది కాదు.
☞ ప్రజలకు ఉపయోగపడే ఆస్తులను ఆక్రమించుకునేవారు.. నరకానికి పోతారు.
☞ మూడుతరాల కోసం ఆలోచించడం మూర్ఖత్వం. మూడేండ్లు బతకడానికి సరిపడా సంపాదిస్తే చాలు.
☞ పాండవుల సైన్యంతో పోలిస్తే కౌరవ మూకల బలమే ఎక్కువ. కానీ, కుంతీ పుత్రులకు ధర్మబలం తోడైంది.
* * *
భీష్మ, విదుర, చాణక్య.. ముగ్గురూ మళ్లీ భూలోకానికి వస్తే? తప్పక తెలంగాణనే సందర్శిస్తారు. గంగా సుతుడైన భీష్మ పితామహుడు.. కాళేశ్వరం ఒడ్డున కుటీరం నిర్మించుకుంటాడు. ధర్మ పక్షపాతి అయిన విదురుడు ముఖ్యమంత్రి నివాసాన్ని తన ఆవాసంగా మార్చుకుంటాడు. పాలన శాస్త్రం మీద పట్టు కలిగిన చాణక్యుడు అత్యద్భుతంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని కేంద్రంగా చేసుకుని చాణక్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పేరుతో శిక్షణ కేంద్రాన్ని స్థాపిస్తాడు. రేపటి నేతలను తీర్చిదిద్దుతాడు. పోలింగ్ రోజున ముగ్గురూ వెళ్లి కారు గుర్తుకు ఓటేసి వస్తారు. మూడు స్వరాలూ కూడి కల్వకుంట్ల చంద్రశేఖర రావును నిండుమనసుతో ఆశీర్వదిస్తాయి.
విజయోస్తు. దిగ్విజయోస్తు. పునర్ అధికారప్రాప్తిరస్తు.