హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): మీ పాస్‌పోర్టు పోయిం దా? అయితే పది రోజుల్లోపే మీకు కొత్త పాస్‌పోర్టు జారీ అవుతుంది. పాస్‌పోర్టు పోగానే చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కొత్త పాస్‌పోర్టు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. తీరా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడగానే బ్రోకర్లను ఆశ్రయించి రూ.వేలల్లో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టును పోగొట్టుకున్నవారు తిరిగి కొత్త పాస్‌పోర్టును ఎలా పొందాలన్న విషయాన్ని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
పాస్‌పోర్టును పొగొట్టుకున్న వాళ్లు తొలుత మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుని, పాత పాస్‌పోర్టు వివరాలను అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ వివరాలు మీ-సేవ కేంద్రం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుతాయి. వాటిని పోలీసులు పరిశీలించి, అప్రూవల్ ఇస్తారు. అనంతరం మీ-సేవ కేంద్రం నుంచి ‘మిస్సింగ్/లాస్ట్ సర్టిఫికెట్’ జారీ అవుతుంది. ఆ సర్టిఫికెట్‌ను పొందాక స్లాట్ బుక్ చేసుకుని, రీఇష్యూ పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్ రోజున ఎంపిక చేసుకున్న పీఎస్కే కేంద్రానికి హాజరై.. సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటు మీ-సేవ కేంద్రం నుంచి జారీ అయిన ‘మిస్సింగ్/లాస్ట్ అక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికెట్‌ను చూపించాలి.
ఆ ప్రక్రియ పూర్తయ్యాక 7-10 రోజుల్లోపు కొత్త పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. కానీ, పాస్‌పోర్టులను పోగొట్టుకున్న కొందరు తమ వద్ద ఎలాంటి వివరాలు లేవని, కనీసం పాత పాస్‌పోర్టు నంబర్, జిరాక్స్ కాపీలు కూడా లేవని చెప్తుంటారు. అలాంటివారు కొత్త పాస్‌పోర్టును పొందాలంటే నేరుగా ఆర్పీఓ కార్యాలయంలో హాజరై ఇతర గుర్తింపు కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాల ఆధారంగా పాస్‌పోర్ట్ డాటాబేస్‌లో పరిశీలించి పాత పాస్‌పోర్టు వివరాలను అందజేస్తారు. వాటి ఆధారంగా మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం మీ-సేవ నుంచి పాస్‌పోర్ట్ మిస్సింగ్/లాస్ట్ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. దాని ఆధారంగా పాస్‌పోర్ట్ రీఇష్యూకు దరఖాస్తు చేసుకుని కొత్త పాస్‌పోర్టును పొందవచ్చని లేదా పాస్‌పోర్టు పోయిందని rpo. hyderabad @mea.gov.inకు మెయిల్ చేసి సూచ నలు పొందొచ్చని జొన్నలగడ్డ స్నేహజ వివరించారు.