కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని కేసీఆర్ గర్జిస్తుంటే ఈ అంశంపై సమాధానం ఇవ్వలేక ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాధారమైన కేసుల లీకులిచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల నుంచి కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి బాధ్యతా కనిపించడం లేదు.
-కేటీఆర్
సూర్యాపేట, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, నోటీసులతో బెదిరింపు రాజకీయాలకు పాల్పడితే బీఆర్ఎస్ లొంగే ప్రసక్తే లేదని, ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న తమ పార్టీది తాటాకుచప్పుళ్లకు బెదిరే నైజం కాదని, ఎంత ఒత్తిడి పెంచితే అంతకు రెట్టింపుగా ఉద్యమించి రేవంత్ సర్కార్‌కు ముచ్చెమటలు పట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అభినందన సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘ఈ గెలుపు మీది మాత్రమే.. మీరు మాత్రమే కేసీఆర్ స్ఫూర్తితో కొట్లాడారు.. అధికార పార్టీ ఆగడాలు, అరాచకాలు, గూండాగిరీ, పోలీసు నిర్బంధాలను ఎదుర్కొని వీరోచితంగా పోరాటం చేసి గెలిచారు’ అని కొనియాడారు. సుమారు 1500 గ్రామాల్లో అధికారులను అడ్డం పెట్టుకొని తిమ్మిని బమ్మిని చేసి రీ కౌంటింగ్‌తో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను ఓడించారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి కాలికిబలపం కట్టుకొని జిల్లా జిల్లా తిరిగారని, స్థానిక ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లు రావని బెదిరించారని, ఊరురా అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఒకవేళ నిజాయితీగా ఎన్నికలు జరిగి ఉంటే 60 శాతం పంచాయతీలను బీఆర్ఎస్ గెలిచి ఉండేదని చెప్పారు.
హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని, కేసీఆర్‌కు నోటీసులు, అరెస్టులు అంటూ పత్రికలు, టీవీలను మేనేజ్ చేసి లీకుల ద్వారా ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. అర్జునుడు చిలుక కన్నును లక్ష్యం చేసుకున్నట్టుగా పార్టీ కార్యకర్తల దృష్టి అంతా 420 హామీల అమలుపైనే ఉంచి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నందున పార్టీ తరఫున జిల్లాకో లీగల్ టీంను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులను రక్షించుకుంటామని భరోసా ఇచ్చారు.
పాలమూరు, రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం తిప్పి పంపితే మాట్లాడే సోయి లేని ప్రభుత్వంపై కేసీఆర్ గర్జిస్తే అందుకు సమాధానం ఇచ్చే తెలివి కూడా ఈ సర్కారుకు లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ఆనాడు కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలు, రంగారెడ్డిలోని ఆరు నియోజకవర్గాలు, నల్లగొండ జిల్లాలోని పశ్చిమ సౌత్ వెస్ట్ మునుగోడు, నల్లగొండ, కొంత నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపయోగపడేలా 90 శాతం పనులు పూర్తి చేస్తే పది శాతం పనులను కూడా చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని విమర్శించారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని కేసీఆర్ గర్జిస్తుంటే ఈ అంశంపై సమాధానం ఇవ్వలేక ప్రజల దృష్టి మరల్చేందుకు నిరాధారమైన కేసుల లీకులిచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లుగా కేవలం దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి బాధ్యతా లేదని దుయ్యబట్టారు. నదీ జలాలపై ముఖ్యమంత్రికి ఏమాత్రం అవగాహన లేదని, ఇక మంత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. ప్రధానంగా ఈ జిల్లాలో నీళ్ల మంత్రి ఉన్నా ఆయనకు నీళ్లపై కనీస అవగాహన లేకపోగా ఎవరైనా ప్రశ్నిస్తే ప్రిపేర్ అవలేదని చెప్తున్నాడని, మరొకాయన వాటర్‌లో నీళ్లు కలిపి మాట్లాడే అజ్ఞాని అని ఎద్దేవాచేశారు. ప్రజల కష్టాలు, సాగు నీటి అవసరాలు తెలియని వాళ్లు అధికారంలోకి వచ్చి అహంకారంతో అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారే తప్ప వీరికి ప్రజలు, రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటే తక్షణమే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు పెట్టాలంటే భయంతో ప్రభుత్వం తప్పించుకు పోతున్నదని ఎద్దేవా చేశారు. ‘జాతీయ రైతు దినోత్సవం రోజు రైతుబిడ్డగా సీఎంను అడుగుతున్నా.. సహకార సంఘాల ఎన్నికలు పెట్టాలి.. రైతులకు ముఖ్యమంత్రి ఏమైనా మంచి చేసి ఉంటే సహకార ఎన్నికలు పెట్టాలి’ అని సవాల్ చేశారు. ‘రైతులు పూర్తి కోపంతో ఉన్నరు. సహకార ఎన్నికలు పెడితే కర్రు కాల్చివాత పెడుతారనే భయంతో దొడ్డిదారిన పదవులు నింపుకొనేందుకు నామినేటెడ్ పద్ధతి తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నరు’ అని దుయ్యబట్టారు.

‘బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లను కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టు తెలుస్తున్నది. అసలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే దిక్కులేదు. ఇక సర్పంచ్‌లకు ఏమిస్తారో మీరే గమనించాలి’ అని సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు కేటీఆర్ సూచించారు. ‘అభివృద్ధి కోసం నిధులివ్వాలని కామారెడ్డి ఎమ్మెల్యే ఏకంగా ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. మాకు పెండ్లిండ్లకు పోవడం తప్ప వేరే పనులు లేవని మహబూబ్‌నగర్ ఎమ్మెలే చెప్పిండు’ అని గుర్తుచేశారు. ‘మీకు రక్షణగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, నిలబడేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒక్కటే.. పంచాయతీలకు వచ్చే నిధులను ఎవ్వరూ అడ్డుకోలేరు’ అని స్పష్టం చేశారు.
‘గ్రామ స్థాయిలో మీరే బాస్‌లు.. నూతన సర్పంచ్‌లు ఎవరూ భయపడవద్దు.. మీ హక్కులు బాధ్యతలపై అన్ని గ్రామాల్లో వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్ పెడుతం’ అని వివరించారు. సభకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిశోర్, కంచర్ల కృష్ణ్ణారెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, కర్నె ప్రభాకర్, విజయసింహారెడ్డి, చకిలం అనిల్, పాల్వాయి స్రవంతి, చెరుకు సుధాకర్, పల్లె రవి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
అలవిగాని ఫోర్ట్వంటీ హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజలను మభ్యపెడుతున్నది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు సంకేతాలుగా ప్రజలు తీర్పునిచ్చిండ్రు.
-కేటీఆర్
‘ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు నోటీసులిస్తామంటడు.. ఇప్పుడు కాదు.. అసెంబ్లీ అయినాక ఇస్తాడంట. ఎంత కాలం అయింది దీనిపై మాట్లాడబట్టి? ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి దీనిపై ఏడ్వంది లేదు. కరెంట్‌పై ఏడ్చిండు. వచ్చిన రిపోర్టును బల్లకింద పెట్టిండు. మళ్లీ కాళేశ్వరం అంటడు. కేసులు అంటడు. ఈ ఫార్ములా ఆ ఫార్ములా ఇట్ల ఏదో అకటి అనుకుంట పోతనే ఉంటడు’ అంటూ సీఎం రేవంత్ తీరుపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేటీఆర్ కష్టపడి తెచ్చిన ఫార్మాసిటీలో రేవంత్‌రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఇన్ని లక్షల కోట్లు అంటే ఆయన గురువు మోదీ, చంద్రబాబు బాగోతాన్ని కేసీఆర్ బయటపెట్టిండు’ అని ఎద్దేవాచేశారు.
బెదిరిస్తే బెదిరేవాళ్లు ఎవ్వరూ లేరని, బెదిరిస్తే ఎదురిస్తామని హెచ్చరించారు. ‘నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో కిడ్నాప్ చేస్తేనే మా కార్యకర్తలు భయపడలే.. నువ్వు కేసు పెడుతా అంటే కేసీఆర్, కేటీఆర్ భయపడుతరా?’ అని నిలదీశారు. నల్లగొండ జిల్లాలో వంద గ్రామాల్లో కేసులు పెట్టారని ఉత్తమ్ సిగ్గులేకుండా ఎన్నికల తర్వాత కూడా కేసులు పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కేసీఆర్ బతికుండగా తెలంగాణకు చీమకుట్టినా ఊరుకోడని తెగేసి చెప్పారు.
రేపు బ్రహ్మాండంగా నల్లగొండ జిల్లా నుంచి యుద్ధం మొదలు పెట్టి పాలమూరు డిండి పూర్తి చేయించేందుకు కేసీఆర్ వస్తారని చెప్పారు. ‘చంద్రబాబు వచ్చి కృష్ణా నీళ్లు కొల్లగొడుతున్నా.. నాగార్జునసాగర్‌ను కేంద్రం చేతిలో పెట్టినా మీకు కమీషన్ల సోయి తప్ప ఇంకోటి లేదు’ అని దుయ్యబట్టారు. ‘గెలిచిన వారిని ప్రలోభ పెట్టే చర్యలు మొదలైనయ్.. అదిస్తాం.. ఇదిస్తామని చెప్పి పిలుస్తున్నరు. అసలు పోయిన ఎమ్మెల్యేల పని ఏమైందో చూడాలి.. కడియం శ్రీహరితో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినమంటున్న ఎమ్మెల్యేలకు ఏమీ ఇవ్వలే. ఆ ఎమ్మెల్యేలకే ఇవ్వనోడు సర్పంచ్‌లకు ఇస్తాడా?’ అని ప్రశ్నించారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఏదీ చేయకుండా వంచించి ఇప్పుడు అడిగిన వారిపై దాడులు, బెదిరింపులకు దిగుతున్నదని, కేసుల పాలు చేస్తున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తులం బంగారం, బతుకమ్మ చీరలు, మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ 4 వేలకు పెంపు అని హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. దీని పర్యవసానంగానే బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులను ప్రజలు సర్పంచ్‌లుగా గెలిపించారని చెప్పారు.