హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద గురువారం మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లను కల్పించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 18నెలలుగా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లులు పెట్టి చేతులు దులుపుకున్నదే తప్ప.. వాటి అమలుకు జీవోను విడుదల చేయలేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ నిధులు, తదితర అంశాలపై పదేసిసార్లు ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి బీసీల రిజర్వేషన్ పెంపు కోసం ఒకసారి కూడా ఎందుకు కలవలేదని నిలదీశారు. బీసీల రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ ఉన్న శాఖలు అగ్రవర్ణాలకు, లేనిశాఖలను బీసీలకు కేటాయించారని, నామినేటెడ్ పదవుల్లో సైతం తీవ్ర అన్యాయం చేశారని గుర్తుచేశారు. రాహుల్‌గాంధీ దేశంలో ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయం ఇదేనా అని ఎద్దేవా చేశారు.