హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ‘ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు కచ్చితంగా గెలుస్తుంది. దమ్ముంటే సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీని రద్దు చేయాలి. ధైర్యముంటే వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగిస్తే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటుందా? అని సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తారా?
కేటీఆర్: ఉచిత విద్యుత్తు గురించి మాట్లాడే హకు ఈ రోజు రేవంత్‌రెడ్డికి అస్సలు లేదు. అమెరికా పర్యటనలో రేవంత్‌రెడ్డి తానే స్వయంగా ‘రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే చాలు, 24 గంటలు దండుగ’ అని మాట్లాడిండ్రు. మొన్న పబ్లిక్ హియరింగ్‌లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా అదే మాట చెప్పిండ్రు. కేసీఆర్ ఎలాంటి నిబంధనలు లేకుండా 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, ఈ ప్రభుత్వం కొత్త డ్రామాలు చేస్తున్నది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మోటర్లకు మీటర్లు పెట్టకపోతే రూ.30 వేల కోట్ల రుణం ఇవ్వబోమని స్పష్టంగా చెప్పారు. దాన్ని రేవంత్‌రెడ్డి విభేదిస్తారా? పైగా సోలార్ పవర్ ద్వారానే భవిష్యత్తులో ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారు.మరి రాత్రిపూట సోలార్ పవర్ రాదు కదా? అప్పుడు కరెంట్ ఎలా ఇస్తారు?
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి
రేవంత్‌రెడ్డికి సవాళ్లు విసిరి పారిపోవడం కొత్తేమీ కాదు. 2018లో కొడంగల్‌లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటా అని చెప్పి, మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిండు. ఆయనకు సిగ్గు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన 420 అభయహస్తం హామీలను అమలు చేయకపోతే ఓట్లు అడుగను అనే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉన్నదా? ఆయనకు 2034 దాకా నేనే సీఎంగా ఉంటా అనేంత ధైర్యం ఉంటే, ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలి. ఈ రోజు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 90కి పైగా సీట్లతో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో గెలుస్తది. ఈ నిజం రేవంత్‌రెడ్డికీ తెలుసు.
ప్రశ్న: ఏపీ కాంట్రాక్టర్లకు పనులివ్వకుండా చట్టం చేస్తామన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అభిప్రాయం?
కేటీఆర్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారికి నేను ఒకటే గుర్తుచేస్తున్నా. మీ ఎన్నికల మ్యానిఫెస్టో (ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్) ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం, బీసీలకు 42 శాతం.. అంటే మొత్తం 72 శాతం కాంట్రాక్టులు స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇవ్వాలి. మరి ఈ 72 శాతంలో కనీసం 72 పైసల పనులైనా ఇప్పటివరకు తెలంగాణలోని వీరికి ఇచ్చారా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్టును, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును ఎవరికిచ్చిండ్రు? గతంలో కాంగ్రెస్ నాయకులే ఈస్ట్ ఇండియా కంపెనీ అని విమర్శించిన మేఘా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కట్టబెట్టిండ్రు. వెంకట్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, 72 శాతం కాంట్రాక్టులు స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చేలా చట్టం తీసుకురావాలి. ఆ చట్టానికి అసెంబ్లీలో మొదటి ఓటు మా బీఆర్ఎస్సే వేస్తది.
ప్రశ్న: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై విశ్లేషణ ఏంటి?
కేటీఆర్: గత పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒక తీవ్రమైన పోలరైజ్డ్ వాతావరణంలో జరిగినయ్. ప్రజలు ‘మోదీ వైపా? లేక మోదీకి వ్యతిరేకమా?’ అనే కోణంలోనే ఓట్లేసిండ్రు. ఇందులో బీఆర్ఎస్ మాత్రమే కాదు.. ఒడిశాలో నవీన్ పట్నాయక్ (బీజేడీ) లాంటి పవర్ ఫుల్ పార్టీకి, మాయావతి బీఎస్పీకి, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌కు, కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ పార్టీ సహా దేశంలోని 13 బలమైన ప్రాంతీయ పార్టీలకు ఒక సీటు కూడా రాలేదు. ఓటమి, గెలుపులు రాజకీయాల్లో తాతాలికం.
కాంగ్రెస్ కూడా ఎన్నో ఓటములను చూసింది
గతంలో కాంగ్రెస్ కూడా ఎన్నో ఓటములు చూసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన పట్టు నిరూపించుకున్నది. మా కార్యకర్తలు, నాయకులు చాలా బలంగా, దృఢంగా ఉన్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా, 2028లో వచ్చినా తెలంగాణలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే.. తిరిగి సీఎం అయ్యేది కేసీఆరే.. ‘ఫెయిల్యూర్ ఈజ్ ఆన్ ఆర్ఫన్.. బట్ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్’ (గెలిస్తే నా వల్లే అంటారు.. ఓడిపోతే వంద కారణాలు వెతుకుతారు). మా ఓటమికి కూడా వంద కారణాలుండొచ్చు. అందులో మీరు చెప్పేది ఒకటి కావచ్చు. కానీ మేము మళ్లీ పుంజుకుంటం.
ప్రశ్న: మీ కుమారుడు హిమాన్షు సిరిసిల్ల పర్యటన.. ఆయన రాజకీయ అరంగేట్రానికి సంకేతమా?
కేటీఆర్: (నవ్వుతూ) ఎందుకన్నా.. పాపం ఆ పిల్లగాడిని ఎందుకు మధ్యలోకి లాగి చెడగొడుతరు? ఆయనో దేవుడి దర్శనానికి గుడికి పోయిండు. హిమాన్షుతోపాటు చదువుకునే కాలేజీ స్నేహితులు ఇద్దరు అమెరికా నుంచి ఎండకాలం సెలవులకు వచ్చిండ్రు. వారిని గుడికి తీసుకెళ్లిండు. ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నరు. మీ పిల్లలైనా అంతే చేస్తరు కదా? దానికి పాపం ఆయనను ఎందుకు లాగుతున్నరు? మేమే బాధపడుతుంటే, ఆయనను మధ్యలోకి తీసుకురాకండి.
ప్రశ్న: 2023లో జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బాగా పెర్ఫార్మ్ చేసింది. కానీ రూరల్‌లో ఆ స్థాయిలో ఎందుకు రాణించలేకపోయింది?
కేటీఆర్: దానికి కారణం కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు 420 హామీలు తప్ప మరేమీ లేదు. రైతులకు రూ.10,000 బదులు రూ.15,000 ఇస్తం, తులం బంగారం ఇస్తం అని నమ్మబలికిండ్రు. రూరల్ తెలంగాణలో కొందరు ప్రజలు ఆ మాటలు నమ్మిండ్రు. కానీ ఇవాళ నమ్మిన వాళ్లంతా తీవ్రంగా బాధపడుతున్నరు. చివరి గింజ దాకా ధాన్యం కొంటమన్న సీఎం, తొలి గింజ కూడా కొనట్లేదు. పంటలకు 500 బోనస్ ఎకడైనా ఇచ్చిండ్రా? రైతు భరోసా రూ.15,000 ఒక రైతుకైనా అందిందా? కాంగ్రెస్‌కు, మాకు ఉన్న ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే. అంటే రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4 లక్షల ఓట్ల డిఫరెన్స్. 119 స్థానాల్లో మేము 39 సీట్లు గెలిచి 37 శాతం ఓట్ షేర్ సాధించినం. ఇది ఏదో భయంకరమైన ఓటమి కాదు. 2014, 2018, 2023లో మేము ఒంటరిగానే పోటీ చేసి గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నం. రాబోయే రోజుల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తం. తిరిగి అధికారంలోకి వస్తం. రేవంత్‌రెడ్డి పంటల మార్పిడి గురించి మాట్లాడటం విడ్డూరం. వ్యవసాయం తెలిసిన తుమ్మల నాగేశ్వర్రావు చెప్తే రైతులు వింటరు.
ప్రశ్న: సుంకిశాల ప్రాజెక్టు వైఫల్యం, హైదరాబాద్‌లో తాగునీటి, కరెంట్ కొరతపై ఏమంటారు?
కేటీఆర్: సుంకిశాల ప్రాజెక్ట్‌ను 2024 నాటికే పూర్తి చేయాలని మేము ప్లాన్ చేసినం. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత సీఎం (మున్సిపల్ మంత్రి కూడా ఆయనే) హయాంలో వందల కోట్ల ప్రజాధనం వృథా చేస్తూ నిర్మించిన రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ రికమండ్ చేసినా సరే.. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే దమ్మూధైర్యం ఈ ముఖ్యమంత్రికి లేదు. ఇదీ తెలంగాణ ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌కు సీట్లు ఇవ్వలేదనే కక్షతో, నారాజుతో ఈ నగర ప్రజలను సతాయిస్తున్నరు. గత పదేండ్లలో హైదరాబాద్‌లో నీటి ఇబ్బందే లేదు. మిషన్ భగీరథ ద్వారా జబర్దస్త్ పని చేసినం. కానీ, వీళ్లు మెయింటెనెన్స్ చేస్తలేరు. మేము పవర్ సప్లయ్‌ని 7,000 మెగావాట్ల నుంచి 17,000 మెగావాట్లకు తీసుకెళ్తే.. వీళ్లు మెయింటెనెన్స్ చేయక పవర్ కట్స్ పెడుతున్నరు. 2014కు ముందున్న ఖాళీ బిందెలు, ట్యాంకర్ల ముందట యుద్ధాలు, జనరేటర్ల గబ్బు, ఇన్వర్టర్ల గబ్బును రేవంత్‌రెడ్డి మళ్లీ తెచ్చిండు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదనేది మరోసారి నిజమైంది.
ప్రశ్న: బీజేపీ మీతో కలిసే చాన్స్ ఉన్నదా? రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ వ్యూహం ఏమిటి?
కేటీఆర్: బీజేపీ మాతో కలవడమేంటి? వాళ్లు ఆల్రెడీ ఇకడ కాంగ్రెస్‌తో కలిసే ఉన్నరు కదా! ఇకడ నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ ‘జోడీ ప్రభుత్వం’. నేను ఊరికే చెప్పట్లేదు. ఆధారాలతో చెప్తున్నా.. ఒక కేంద్ర మంత్రి కుమారుడు పోక్సో కేసులో నిందితుడిగా ఉంటే, తొమ్మిది రోజులపాటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కాపాడలేదా? ఒకరినొకరు బ్రహ్మాండంగా రక్షించుకుంటున్నరు. 2024 సెప్టెంబర్ 28 నాడు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగినయ్. ఇప్పుడు మనం 2026లో ఉన్నం.. రెండేండ్లు కావస్తున్నా ఈడీ కనీసం ప్రెస్‌నోట్ కూడా ఎందుకు వదల్లేదు? కేసు ఏమైంది? ఎవరు కాపాడుతున్నరు? రేవంత్‌రెడ్డి ‘ఆర్ఆర్ టాక్స్’ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రే ఆరోపించిండ్రు. మరి ఎందుకు చర్యల్లేవు?
ప్రశ్న: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది?
కేటీఆర్: రాష్ట్రంలో దాదాపు 71,000 మంది బూత్ లెవెల్ ఏజెంట్లను అపాయింట్ చేసుకున్నం. వారందరికీ ట్రైనింగ్ ఇచ్చి హ్యాండ్‌బుక్స్ అందిస్తున్నం. సస్పెక్టెడ్, డూప్లికేట్ ఓటర్ల లిస్ట్‌ను వారికి ఇచ్చి వెరిఫై చేయిమంటున్నం. ‘అర్హుడైన ఏ ఒకరి ఓటు పోకూడదు..అనర్హుడైన ఎవరికీ ఓటు రాకూడదు’ అనే నినాదంతో ముందుకు పోతున్నం.
సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి గాంధీభవన్‌కు భద్రంగా పంపిస్తామని గతంలో మీరన్నారు. తాజాగా అమీర్‌పేట మైత్రీవనంలో పెట్టిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆంధ్రాకు పార్సిల్ చేస్తామని కవిత అంటున్నారు. దీనిపై మీ పార్టీ వైఖరి ఏంటి?
రాష్ట్రంలో ఎన్నో ముఖ్యమైన సమస్యలు ఉంటే రేవంత్‌రెడ్డి ఆడుతున్న ఈ డైవర్షన్ గేమ్‌లో మీడియా కూడా పడినట్టున్నది. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాక ఇలాంటి టైమ్‌పాస్ కార్యక్రమాలు పెడుతున్నడు. రాగానే తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చిండు. ఆడపిల్ల పెండ్లికి తులం బంగారం ఇస్తానని చెప్పి, తెలంగాణ తల్లి నెత్తిన ఉన్న కిరీటాన్ని, వడ్డాణాన్ని మాయం చేసిండు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట రాహుల్‌గాంధీ తండ్రి (రాజీవ్‌గాంధీ) విగ్రహాన్ని పెట్టిండు. ఆయనకు తెలంగాణకు ఏం సంబంధమో రేవంత్‌రెడ్డికే తెలియాలి. ఇక ఎన్టీఆర్ విగ్రహం విషయానికి వస్తే.. మాకు ఆయనపై ఎలాంటి అగౌరవం లేదు. కానీ, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహాన్ని మాత్రం మా ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే భద్రంగా గాంధీభవన్‌కు పార్సిల్ చేసే బాధ్యతను వ్యక్తిగతంగా నేనే తీసుకుంటా.
కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. సీబీఐ, ఈడీ లేదా ఐటీతో దర్యాప్తు చేయించాలని రికమండ్ చేస్తే ఆ రిపోర్ట్ ఎటుపోయింది? సింగరేణిలో సైట్ విజిటేషన్ సర్టిఫికెట్ పేరిట నిబంధనలు మార్చి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కాంట్రాక్టులను రింగ్ చేస్తున్నడని సాక్ష్యాలిస్తే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు? కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు వస్తయి. ఇటు స్టేట్ గవర్నమెంట్ యంగ్ ఇండియా సూల్స్‌లో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కాంట్రాక్టులు వస్తయి. ఫ్యూచర్ సిటీలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు కాంట్రాక్టులు వస్తాయి. వీరిద్దరిదీ అంత గట్టి ఫెవికాల్ బంధం.
అభయహస్తం మ్యానిఫెస్టో అమలు
చేయకపోతే ఓటు అడుగను అనే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉన్నదా? 2034 దాకా ముఖ్యమంత్రిగా ఉంటానంటున్నవ్ కదా.. అంత ధైర్యం ఉంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేసి రా.. ఈ రోజు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో గెలుస్తది. 90 సీట్లకు పైగా గెలిచే అవకాశం ఈరోజు ఉన్నది. ఇవన్నీ ఆయనకు తెలిసే అటెన్షన్ డైవర్షన్ కోసం నాటకాలు ఆడుతున్నడు.
-కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిందని, ప్రస్తుతం రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నదన్న కాంగ్రెస్, కిషన్‌రెడ్డి ఆరోపణలపై మీరేమంటారు?
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నవన్నీ పచ్చి అబద్ధాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నా. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా ఎంత వడ్డీ (మిత్తి) కడుతున్నదో అధికారిక లెకలు నా దగ్గర ఉన్నయి.
ఈ రకంగా గత ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి (2026) వరకు మొత్తం రూ.29,679 కోట్ల వడ్డీ చెల్లించిండ్రు. సగటున నెలకు రూ.2,500 కోట్లు అవుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాము నెలకు రూ.6,500 కోట్లు అప్పులకే కడుతున్నామని చెప్తున్నరు. ప్రభుత్వం తన కాకి లెకలు పకన పెట్టి, వాస్తవాలు మాట్లాడాలి. వీరు ఒకసారి రూ.6 లక్షల కోట్ల అప్పు అంటరు. మరోసారి రూ.10 లక్షల కోట్ల అప్పు అంటరు. కానీ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది రూ.4.20 లక్షల కోట్ల అప్పేనని స్పష్టం చేసింది. మరి మనం ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ లెకలను నమ్మాల్నా? లేక రేవంత్‌రెడ్డి కాకి లెకలను నమ్మాల్నా? కిషన్‌రెడ్డి ఆరోపణల విషయానికి వస్తే.. బీజేపీతో పొత్తులు ఉన్నప్పుడు నితీశ్‌కుమార్, ఉద్ధవ్‌ఠాక్రే, ఆదిత్య ఠాక్రే వంటి వారి కుటుంబ రాజకీయాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సిద్ధాంతపరంగా తమను వ్యతిరేకించే వారిపై మాత్రం కుటుంబ రాజకీయం అంటూ విమర్శలు గుప్పిస్తరు.