దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇస్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కార్ నల్ల చట్టాలతో రైతుల నడ్డి విరుస్తుంది. తెలంగాణలో అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ర్టాల్లో ఎక్కడైన అమలు చేస్తున్నారా?. ఒకవేళ ఏ రాష్ట్రంలోనైనా ఇచ్చినట్టు నిరూపిస్తే ఈ ఎన్నికలో ఓట్లు అడగం. – మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట, సెప్టెంబర్ 12: ‘బీజేపీ నేత ఈటల రాజేందర్ మొసలి కన్నీళ్లు కారుస్తుండు.. ఓటర్ల ను ఆకట్టుకోడానికి తాయిలాలు ఇస్తూ దిగజారుడు రాజకీయం చేస్తుండు.. రూపాయి బొట్టు బిళ్లకు, గోడ గడియారానికి, కుట్టు మెషిన్లకు, గ్రైండర్లకు మోసపోతే భవిష్యత్‌లో గోసపడుత రు’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నా రు. బీజేపీ చేసిందేమీ లేదని.. ఇకపై చేసేదీ ఏమీఉండదని ఎద్దేవాచేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ.. బతుకులు వేటితో మారతాయో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ వచ్చాక రైతుల బతుకులు మారాయో లేదో గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం ఇస్తుంటే, కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నదని ఆరోపించారు. గ్యాస్ సబ్సిడీని బ్యాంకులో వేస్తామని నమ్మించిన బీజేపీ.. ప్రణాళిక ప్రకారం ధరను పెంచుతూ సబ్సిడీలో కోత విధించిందని ధ్వజమెత్తారు. గ్యాస్ సబ్సిడీ మాదిరే బావుల కాడ మీటర్లు పెట్టి కరెంట్ భారాన్ని రైతులమీదకు నెట్టేస్తుందని చెప్పారు. దొడ్డు వడ్లు కొనమంటున్న బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. ప్రజలు గ్యాస్ సిలిండర్‌కు దండంపెట్టి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు.
ఉద్యోగాలిచ్చే పార్టీ టీఆర్ఎస్.. ఊడగొట్టేది బీజేపీ
ఉద్యోగాలిచ్చే పార్టీ టీఆర్ఎస్.. ఊడగొట్టే పార్టీ బీజేపీ.. యువత ఎటు వైపుంటరో ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని బీజేపీ సర్కార్ అమ్మకానికి పెట్టిందని.. కంపెనీలు ప్రైవేటుపరం చేసి రిజర్వేషన్లు తీసేయాలని చూస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో 1.30 లక్షల ఉద్యోగాలు, ప్రైవేట్‌రంగంలో మరో 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని.. మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసేందుకు సిద్ధమవుతన్నామని స్పష్టంచేశారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి రెండున్నరేండ్లు పూర్తయినా బండి సంజయ్ ఇక్కడ పది రూపాయల పనైనా చేశారా? అని ప్రశ్నించారు. గెలిచి బండేం చేయలే.. ఈటల కూడా ఏంచేయడని స్పష్టంచేశారు. ఈటల విజ్ఞతను కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఓటమి భ యంతో మంత్రులను, ఎమ్మెల్యేలను, దళిత ఎమ్మెల్యేలను ‘ఓరెయ్.. రారా..’ అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. గెల్లుకు ఉప ఎ న్నికల్లో మద్దతు ఇస్తామని మున్నూరుకాపులు చేసిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని మంత్రులకు అందజేశారు. హుజూరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని పీ నిశిత చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక పాల్గొన్నారు.
రజకుల ఆత్మగౌరవం పెంచింది టీఆర్ఎస్సే
స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు వచ్చాకనే రజకుల అత్మగౌరవం పెరిగిందని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లో జరిగిన రజక సం ఘం సమావేశానికి మంత్రి హాజరయ్యా రు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని, ఇందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని మంత్రి తెలిపారు. అనంతరం మైనార్టీ కళాశాలల ఔట్ సోర్సింగ్ జూనియర్ లెక్చరర్లు, రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు, ఎల్ఐసీ ఏజెంట్లతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్కే తాము మద్దతు తెలుపుతున్నట్టు ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ జూనియ ర్ లెక్చరర్లు మంత్రి సమక్షంలో ప్రకటించారు. అంతకుముందు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో ఇల్లందకుంట మండలం సీతంపేటకు చెందిన బీజేపీ యువ నాయకుడు బక్కతట్ల అజయ్‌యాదవ్ సహా నియోజకవర్గంలోని 500 మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
నాకు పదవి వస్తే ఈటల ఓర్వలేదు: మంత్రి గంగుల
తనకు మంత్రి పదవి వస్తే ఈటల రాజేందర్ ఓర్వలేదని, రాజకీయంగా అణగదొక్కాలని చూశాడని మంత్రి గంగుల కమలాకర్ గుర్తుచేశారు. గత కొన్నేళ్లుగా మున్నూరుకాపు సంఘ భవనం కోసం ఈటలను కలిసినా గుంట భూమి కూడా ఇవ్వలేదనేది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మంత్రి హరీశ్‌రావుకు చెప్పగానే ఎకరం భూమి కేటాయించారని చెప్పారు. మూడు కోట్ల విలువైన 11 గుంటల భూమితోపాటు రూ.కోటి ఇచ్చినందుకు ప్రభుత్వానికి మున్నూరు కాపులు కృతజ్ఞతగా ఉండాలని కోరారు
బీజేపీకి ఓటేసేదే లేదు
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల పై భారం మోపుతు న్న బీజేపీకి ఓటు వేసేదే లేదు. పేదల పక్షాన ఉన్న టీఆర్ఎస్కే ఓటేస్తాం. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు కోసం మేమంతా కష్ట పడుతాం. గతంలో మున్నూరుకాపు సం ఘం భవనం కోసం ఈటల రాజేందర్‌ను ఎన్నిసార్లు కోరినా ఫలితం దక్కలేదు. ఇప్పుడు మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ను అడగ్గానే మున్నూరుకాపు సంఘ భవనం కోసం స్థలం కేటాయించారు. వారికి ధన్యవాదాలు.